హిందువులకు పరమపవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో 44 మంది అన్యమతస్తులు పనిచేస్తున్నారు. వారందరికీ రెండు రోజులలో నోటీసులు ఇవ్వబోతున్నట్లు టిటిడి బోర్డు తెలిపింది. టిటిడి డిప్యూటీ ఈవోగా పనిచేస్తున్న స్నేహలత క్రీస్టియన్ మతస్థురాలైనందున, ఆమె తన క్రింది ఉద్యోగులకు తరచూ క్రీస్టియన్ మతభోధనలు వినిపిస్తుంటారని ఆరోపణలు వినిపించాయి. అలాగే విధి నిర్వహణలో తిరుమల ఆచారాలను, సాంప్రదాయాలను పాటించడానికి ఆమె నిరాకరిస్తుంటారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆమె టిటిడి పద్దతులను, నియమనిబంధనలను పాటించకపోయినా టిటిడి ఇచ్చిన వాహనంలోనే చర్చికి వెళ్ళి వస్తుంటారని మరో ఆరోపణ ఉంది. ఆమె వ్యవహారశైలిపై వివిధ మఠాపతులు, స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెతో సహా టిటిడిలో పనిచేస్తున్న 44 మంది అన్యమతస్తులను తక్షణం విధులలో నుంచి తొలగించాలని ఒత్తిడి చేయడంతో టిటిడి ఈ నిర్ణయం తీసుకొంది.
టిటిడిలో అన్యమతస్థులు పనిచేస్తున్నారని ఇంతకాలంగా టిటిడి బోర్డు సభ్యులకు తెలియదనుకోలేము. కానీ స్నేహలత వ్యవహారశైలిపై విమర్శలు వచ్చే వరకు వారు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కనుక తప్పు బోర్డు సభ్యులదేనని చెప్పక తప్పదు. స్నేహలతతో సహా 44 మంది కూడా తమ మతాన్ని పాటించేందుకు పూర్తి హక్కు కలిగి ఉన్నారు. దానిని టిటిడి కూడా కాదనలేదు. కానీ హిందువుల పుణ్యక్షేత్రమైన తిరుమల కొండపై హిందూ ధర్మానికి విరుద్దంగా వ్యవహరించడం కూడా తప్పే. అయితే దానికి వారిని తప్పు పట్టే బదులు దేవాదాయ శాఖ తనను తాను నిందించుకోవలసి ఉంటుంది.
దేవాదాయశాఖలో అన్యమతస్తులకు ఉద్యోగం ఇవ్వకూడదు. ఒకవేళ ఉద్యోగంలో చేరిన తరువాత మతం మారినట్లయితే, వారిని ప్రభుత్వానికి సరెండర్ చేసి వేరే శాఖకు మార్చాలి అనే నిబంధనలను ఖచ్చితంగా పాటించి ఉండి ఉంటే ఇటువంటి సమస్య అసలు ఉత్పన్నం అయ్యేదే కాదు. అన్యమతస్తులను చేర్చుకోకూడదు, కొనసాగించకూడదనే ఈ నిబంధన దేవాదాయ శాఖకు మాత్రమే కాక వక్ఫ్ బోర్డుతో సహా అన్ని మత సంబంధమైన సంస్థలకు కూడా వర్తింపజేయడం మంచిది. ఎందుకంటే ఒక మతానికి చెందినవారు వేరే మతాన్ని, దాని ఆచార వ్యవహారాలను పాటించాలనుకోవడం సరికాదు. సున్నితమైన మతసంబందమైన ఉద్యోగాలలో నియామకాలు జరిపేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా నివారించవచ్చు.