నాకు ఆ ఆలోచన లేదని చెప్పాను: కెసిఆర్

December 30, 2017


img

కోకాపేటలో గొల్ల, కుర్మ కమ్యూనిటీ హాల్ కు ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. 

“కొన్ని రోజుల క్రితం నేను డిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసినప్పుడు, మీకు జాతీయ రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యం ఉందా? అని అయన నన్ను అడిగారు. నాకు ఆ ఉద్దేశ్యం లేదని చెప్పాను. జీవితాంతం తెలంగాణా రాష్ట్రానికి, ప్రజలకు సేవ చేసుకోవాలనుకొంటున్నాను. అందులోనే నాకు ఎక్కువ తృప్తి లభిస్తోంది అని చెప్పాను,” అని అన్నారు. 

వచ్చే ఎన్నికలలో తెరాసను మళ్ళీ గెలిపించిన తరువాత కెసిఆర్ తన కుమారుడు మంత్రి కేటిఆర్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి, అయన జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తారని ఆ మద్యన వార్తలు వచ్చాయి. అవే కనుక నిజమనుకొంటే వచ్చే ఎన్నికలలో తెరాస రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ లేదా భాజపాతో చేతులు కలపవలసి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొనే అవకాశం కనబడటం లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కూడా ప్రధాని మోడీ నేతృత్వంలో ఎన్డీయే కూటమే విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కనుక రాష్ట్ర స్థాయిలో భాజపాతో పొత్తులు పెట్టుకొని ఎన్డీయేలో భాగస్వామిగా చేరి, ఎన్నికల అనంతరం కేంద్రమంత్రి పదవి చేపట్టవచ్చని అప్పుడప్పుడు మీడియాలో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. నిజానికి ఏడాదిన్నర క్రితమే తెరాస ఎంపి కవిత కేంద్రమంత్రి పదవి చేపట్టబోతున్నారని జోరుగా వార్తలు వచ్చాయి. ఆమె కూడా వాటికి అనుకూలంగానే మాట్లాడటం బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. కనుక ఎప్పటికైనా తెరాస-భాజపాల మద్య పొత్తులు కుదిరి ఎన్డీయే కూటమిలో తెరాస భాగస్వామి అయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.  

బహుశః అందుకే కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆవిధంగా అడిగి ఉండవచ్చు. లేదా రాష్ట్రంలో భాజపా పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తమతో పొత్తులకు ఆసక్తి ఉందో తెలుసుకోవడానికి అడిగి ఉండవచ్చు లేదా కెసిఆర్ భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఏవిధంగా ఉందో తెలుసుకని తదనుగుణంగా రాష్ట్ర భాజపాను వచ్చే ఎన్నికలకు సంసిద్ధం చేసేందుకు అడిగి ఉండవచ్చు. లేదా కెసిఆర్ వంటి మంచి సమర్ధుడైన వ్యక్తి కేంద్రప్రభుత్వంలోకి తీసుకొన్నట్లయితే, మోడీ ఆశయాలకు ఆకాంక్షలకు అనుకూలంగా అభివృద్ధి, సంక్షేమ పనులను పరుగులెత్తించగలరని భావించి ఉండచ్చు. 

కారణాలు ఏవైనప్పటికీ, ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళరని స్పష్టం అయ్యింది కనుక ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్, భాజపాలు తెరాసను డ్డీకొనడానికి తదనుగుణంగా తమ ఎన్నికల వ్యూహాలను సిద్దం చేసుకోవచ్చు. 


Related Post