ముస్లిం వివాహిత మహిళల జీవితాలకు భద్రత కల్పించేందుకు ఉద్దేశ్యించబడిన ‘ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు-2017’ (ట్రిపుల్ తలాక్ బిల్లు)ను ఒక్కరోజులోనే లోక్ సభలో ప్రవేశపెట్టి చర్చించడం, ఓటింగ్ జరిపి ఆమోదముద్ర వేయడం జరిగిపోయాయి. కేంద్రప్రభుత్వం దానిని అంత వేగంగా కదిలిస్తుందని బహుశః ప్రతిపక్షాలు కూడా ఊహించి ఉండవు. లోక్ సభలో కేంద్రప్రభుత్వానికి మెజారిటీ ఉంది కనుక అవలీలగా దానికి అమోదముద్ర వేయించుకోగలిగింది. కానీ రాజ్యసభలో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు ఎక్కువ బలం ఉంది కనుక అక్కడ చాలా చాకచక్యంగా ఆమోదింపజేసుకోవలసి ఉంటుంది. ఈ బిల్లుకు రాజ్యసభ చేత కూడా ఆమోదముద్ర వేయించుకోగలిగితే, ఇక దానిని చట్టరూపం కల్పించి అమలుచేయడాన్ని ఎవరూ ఆపలేరు.
కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఈ బిల్లును అడ్డుకొన్నా లేదా ఆమోదముద్ర పడేందుకు సహకరించినా భాజపాకే రాజకీయ లబ్ది కలుగుతుంది. ఏవిధంగా అంటే, ఒకవేళ దానిని రాజ్యసభలో అడ్డుకొని నిలిపివేసినట్లయితే, ‘ముస్లిం మహిళల జీవితాలకు తమ ప్రభుత్వం మేలు చేసేందుకు ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అడ్డుపడుతున్నాయని భాజపా ప్రచారం చేసుకొనే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆమోదముద్ర పడేందుకు అవి సహకరించినట్లయితే ముస్లిం మత పెద్దలు, గురువులు, ముస్లింల ఆగ్రహానికి గురికావలసి ఉంటుంది. కానీ ఈ బిల్లు వలన కోట్లాది ముస్లిం మహిళలకు రక్షణ, ఉపశమనం కలుగుతుంది కనుక దానిని ప్రతిపక్షాలు మరీ గట్టిగా వ్యతిరేకించినట్లయితే ముస్లిం మహిళల ఓట్లను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కనుక సహరించక తప్పదు. భాజపా అప్పుడు ‘దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ చేయలేని పనిని తాము మూడున్నరేళ్ళలో చేసి చూపించామని చెప్పుకొని ముస్లిం మహిళల మన్ననలు పొందవచ్చు. కనుక ప్రతిపక్షాలు ఈ బిల్లు విషయంలో ‘కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లు’ మొక్కుబడిగా వ్యతిరేకతతో సరిపెట్టుకోవచ్చు. కనుక ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొంది చట్టరూపం దాల్చే అవకాశాలు ఎక్కువున్నాయని చెప్పవచ్చు.
ఇక ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొంది చట్టరూపం దాల్చినట్లయితే, ఇక ఏవిధంగా ‘ట్రిపుల్ తలాక్’ చెప్పి భార్యను విడిచిపెట్టినప్పటికీ అది చట్ట ప్రకారం శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుంది. ట్రిపుల్ తలాక్ చెప్పి భార్యను విడిచిపెట్టిన వ్యక్తిపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసి మూడేళ్ళు జైలు శిక్ష విధించవచ్చు. అదేవిధంగా అతను తప్పనిసరిగా భార్యకు భరణం చెల్లించవలసి ఉంటుంది. ఆవిధంగా భర్తచేత విడిచిపెట్టబడిన మహిళకు తమ మైనర్ పిల్లలపై సంపూర్ణ హక్కులను, కస్టడీ కోరే హక్కు ఏర్పడుతుంది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో తప్ప దేశమంతటా వర్తిస్తుంది.