మన తెలంగాణా-2017

December 28, 2017


img

తెలంగాణా రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్ళు పూర్తికానేలేదు కానీ ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం పేరు దేశమంతా మారుమ్రోగిపోతోంది. తెలంగాణాలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి, దాని కోసం జరుగుతున్న ‘టీం వర్క్’ ను చూసి అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. పార్లమెంటులో ఇతర రాష్ట్రాల సభ్యులు ఇప్పుడు తెలంగాణా సభ్యులకు ప్రత్యేకం గౌరవం ఇస్తున్నారంటే అతిశయోక్తి కాదు. 

రాష్ట్రాభివృద్ధికి తెలంగాణా ప్రభుత్వం అవలంభిస్తున్న విన్నూత్నమైన విధానాలు, కనబరుస్తున్న చిత్తశుద్ధి, ఫలితాలే అందుకు కారణం. ఏదో మూస పద్దతిలో ప్రణాళికలు తయారుచేసి, నిధులు విడుదల చేసి చేతులు దులుపుకోకుండా, తెలంగాణా ఎదుర్కొంటున్న సమస్యలు, దాని అవసరాలు, లభ్యమయ్యే వనరులు అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని, రాష్ట్రానికి అనువైన ప్రణాళికలు, విధివిధానాలు రూపొందించుకొని ముందుకు సాగుతుండటం వలన మూడున్నరేళ్ళలోనే ఫలితాలను కూడా కళ్ళకు కనబడుతున్నాయి. కనుకనే రాష్ట్రంలో అన్ని రంగాలు సమాంతరంగా అభివృద్ధి అవుతున్నాయి. 

ఉదాహరణకు వ్యవసాయం, సాగునీటి రంగానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తోందో, ఐటి, పారిశ్రామికాభివృద్ధికి అంతే ప్రాధాన్యం ఇస్తోంది. అదేసమయంలో విద్యా, వైద్య, ఆరోగ్య రంగాలకు అంతే ప్రాధాన్యం ఇస్తోంది. అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించామని సంక్షేమ రంగాన్ని నిర్లక్ష్యం చేయలేదు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం ఎంత ముఖ్యమో తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలు అంతే ముఖ్యమని భావించి బతుకమ్మ పండుగ మొదలు కళలు, సాహిత్యం వంటివాటిని చాలా ప్రోత్సహిస్తున్నందున తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు ఎటువంటి ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నాయో తెలంగాణా రాష్ట్రానికి కూడా ఇప్పుడు ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. 

2017లో తెలంగాణా రాష్ట్ర ప్రస్తానం చూసినట్లయితే దాని అడుగులు సంస్కరణలు, అభివృద్ధివైపు పడుతూ కనిపిస్తాయి. 2016లో జిల్లాల పునర్వ్యస్థీకరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ ఏడాదిలో మండలాలు, గ్రామ పంచాయితీల పునర్వ్యస్థీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అలాగే దశాబ్దాలుగా సర్వేకు నోచుకోని భూముల సమగ్ర సర్వే చేయిస్తోంది. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం కూడా సమాంతరంగా చేయిస్తోంది. 

‘రాష్ట్రంలో ప్రతీ ఇంటికి మంచి నీళ్ళు అందించకపోతే వచ్చే ఎన్నికలలో ప్రజలను ఓట్లు అడుగబోము’ అని ప్రతిజ్ఞ చేసి మరీ మిషన్ భగీరథ పనులు మొదలుపెట్టించిన ముఖ్యమంత్రి కెసిఆర్, ఈ ఏడాది ఆగస్ట్ నాటికే దాని మొదటిదశ పనులను పూర్తి చేసి గజ్వేల్ లో ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా చేయించారు. త్వరలోనే మిగిలిన పనులు కూడా పూర్తికాబోతున్నాయి. వినూత్నమైన ఈ పధకాన్ని అది అమలవుతున్న తీరును అధ్యయనం చేసేందుకు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు రావడమే ఆ పధకం గొప్పదనాన్ని చాటుతోంది. 

ఇక మిషన్ కాకతీయ గురించి చెప్పినప్పుడు నవ్వినవారే ఇప్పుడు అది అమలవుతున్న తీరును, దానితో కనిపిస్తున్న సత్ఫలితాలను చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అసలు అటువంటి ఆలోచనే ఎవరి ఊహకు అందనిదంటే అతిశయోక్తి కాదు.

ఇక పారిశ్రామికాభివృద్ధి గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఎందుకంటే, గత ఏడు దశాబ్దాలలో (హైదరాబాద్ లో కేంద్రీకృతమైన) జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు అనుకొంటే, ఈ మూడున్నరేళ్ళలో (వికేంద్రీకరణ పద్దతిలో) జరిగినది మరొక ఎత్తు అని చెప్పక తప్పదు. సిరిసిల్ల, వరంగల్ జిల్లాలో చేనేత, మరమగ్గాల పరిశ్రమలు, సంగారెడ్డి సుల్తాన్ పూర్ వద్ద ఫార్మా సిటీ, ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు కర్మాగారం, కరీంనగర్ లో ఇనుప ఖనిజం మైనింగ్ ప్లాంట్, మహబూబ్ నగర్ జిల్లాలో తాడూర్ వద్ద సోలార్ పవర్ ప్లాంట్...సింగరేణిలో త్వరలో ప్రారంభం కానున్న 6 ఓపెన్ కాస్ట్, 6 అండర్ గ్రౌండ్ గనులు...ఈవిధంగా చెప్పుకొంటూపోతే అదే పెద్ద జాబితా అవుతుంది. 

ఈ మూడున్నరేళ్ళలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో సుమారు 2,000కు పైగా సంస్థలు నిర్మాణపనులకు శ్రీకారం చుట్టాయి. అవన్నీ వివిధ దశలలో ఉన్నాయి. వాటి నిర్మాణాలు పూర్తయి ఉత్పత్తి ప్రారంభిస్తే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగడంతో బాటు వాటి వలన రాష్ట్ర ఆర్ధికపరిస్థితి మరింత బలపడుతుంది.

సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోకతప్పదు. ఎందుకంటే ఆ రంగంలో తెలంగాణా రాష్ట్రం సాధిస్తున్న అద్భుతమైన ప్రగతి గురించి చెప్పుకోవాలంటే నాలుగు ముక్కలలో చెప్పడం సాధ్యం కాదు.    

ఇక 2016-17 తెలంగాణా రాష్ట్రం నుంచి రూ.85,470 కోట్లు విలువగల ఐటి ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేసి రికార్డు సృష్టించాయి. రాష్ట్రంలో కొత్తగా ఐటి పార్కులు, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు, ఇంక్యూబేటర్లు నెలకొల్పడంతో ఐటి రంగం కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. 

రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు నెలకొల్పడానికి అత్యంత అనుకూలమైన వాతావరణం ప్రభుత్వం సృష్టించడం చేత అనేక చిన్నా పెద్ద, మధ్యతరగతి పరిశ్రమలు, సంస్థలు రాష్ట్రానికి తరలివస్తున్నాయి. ఆ కారణంగానే రాష్ట్రానికి ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకులో నెంబర్: 1 స్థానంలో నిలబడింది. ఆ కారణంగానే హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన జి.ఈ.సి. సదస్సు జరిగింది. మంత్రి కేటిఆర్ కు ‘లీడర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. 

ఇక హైదరాబాద్ వాసులు ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న మెట్రో రైల్ సర్వీసులు నవంబర్ 29 నుంచి ప్రారంభం అవడంతో హైదరాబాద్ నగరం పూర్తి స్థాయి మెట్రో హంగులు సంతరించుకొన్నట్లయింది. ఆ తరువాత కొద్ది రోజుల వ్యవధిలోనే జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో తెలంగాణా బాష, యాస, సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం, కళలు అన్నిటినీ ప్రపంచానికి చాటిచూపింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ సభలలో ఎప్పుడో దశాబ్దాల క్రితం మరుగున పడిన పేరిణీ నృత్య ప్రదర్శన చూసి కళాభిమానులు అందరూ ఆనందంతో పొంగిపోయారు. ఆ సభలు జరిగిన తరువాతే చాలా మందికి మన తెలంగాణా రచయితల, కవుల గొప్పదనం, వారి రచనలు, కవితలు విలువ తెలిసి వచ్చాయంటే అతిశయోక్తి కాదు. 

ఇక ఈ ఏడాది తెలంగాణాకు చెందిన సామాన్యులలో అసమాన్యులనదగ్గ ఇద్దరికి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డులు లభించాయి. వారిలో ఒకరి వనజీవి మొక్కల రామయ్య కాగా మరొకరు చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం. కోటికి పైగా మొక్కలు నాటి సంరక్షించినందుకు మన రామయ్యకు పద్మశ్రీ లభించగా, చేనేత కార్మికుల పని సులభతరం చేసే ‘లక్ష్మీ ఆసు యంత్రం’ తయారు చేసినందుకు మల్లేశానికి పద్మశ్రీ అవార్డు లభించింది. అయన ప్రతిభ, తపనను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయనకు కోటి రూపాయలు అందజేసి ప్రోత్సహించింది. 

మౌలికవసతుల కల్పనను కూడా ఒక ఉద్యమస్థాయిలో అమలుచేస్తూ రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు కూడా రోడ్లు, కాలువలు, విద్యుత్ దీపాలు, మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలలో మౌలికవసతుల కల్పన చేస్తోంది. బడుగుబలహీన వర్గాలకు, మైనార్టీ విద్యార్ధుల కోసం కొత్తగా గురుకుల పాఠశాలల ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 31 జిల్లాలలో గల ప్రభుత్వాసుపత్రులలో 40 ‘ఉచిత డయాలసిస్ యూనిట్లను’ ఏర్పాటు చేస్తోంది. వాటిలో ఇప్పటికే డజనుకు పైగా కిడ్నీ రోగులకు అందుబాటులోకి వచ్చాయి.       

ఇక సంక్షేమ రంగంలో కూడా తెలంగాణా ప్రభుత్వం తనదైన ముద్ర వేసింది. పేద ఆడపిల్లల పెళ్ళిళ్ళకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గర్భిణి స్త్రీలకూ కెసిఆర్ కిట్స్, అమ్మ ఒడి పధకాలు, గొల్ల కురుమలకు రాయితీ పై గొర్రెల పంపిణీ, పూడిక తీసిన చెరువులలో చేపపిల్లలను వదిలి మత్స్యకారులకు ఆదాయవనరును సృష్టించడం, కళాకారులకు కూడా పించన్లు, సింగరేణి కార్మికులకు, వారి కుటుంబ సభ్యులు తల్లితండ్రులకు కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో వైద్య సౌకర్యం కల్పించడం, ఆశా వర్కర్లు, హోంగార్డులు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు బారీగా జీతాలు పెంచడం వంటివి అనేకం అమలుచేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ సమాజంలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకొంటున్నారు.             

ఇక చేదు రాజకీయాల విషయానికి వస్తే, ఇక ఈ ఏడాదిలో కూడా చాలామంది రాజకీయ నాయకులు పార్టీలు మారినప్పటికీ సంచలనం సృష్టించిన పార్టీ ఫిరాయింపు మాత్రం రేవంత్ రెడ్డిదేనని చెప్పవచ్చు. అయన తెదేపాను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో రాష్ట్రంలో తెదేపా గొంతు వినపడకుండా పోయింది. తెలంగాణా ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాంకు తెరాస సర్కార్ మద్య దూరం ఈ ఏడాదిలో ఎంతగా పెరిగిపోయిందో అందరూ చూశారు. అయన కూడా ఒక ప్రతిపక్ష నేతకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ప్రభుత్వంతో పోరాటాలు చేస్తుండటం విశేషం. ధర్నా చౌక్ తరలింపు, నిరుద్యోగ ర్యాలి, తెలంగాణా అమరవీరుల స్ఫూర్తి యాత్ర, కొలువులకై కొట్లాట సభ వంటి వరుస కార్యక్రమాలతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నారు.

గత ఏడాదిలో ఫిరాయింపుల కారణంగా బాగా డీలాపడిపోయిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది మళ్ళీ బాగా పుంజుకోవడమే కాకుండా వివిధ ప్రజా సమస్యలపై అధికార తెరాసకు గట్టి సవాళ్ళు విసరగలిగిందని చెప్పక తప్పదు. ఇక కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంటే డిసెంబర్ 28వ తేదీన తన 133వ హ్యాపీ బర్త్ డే (వ్యవస్థాపక దినం) ఘనంగా జరుపుకొంది.

ఈ ఏడాదిలో చెప్పుకోక తప్పనివి సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు. అవి శాసనసభ ఎన్నికలన్న స్థాయిలో జరిగాయి. వాటి కారణంగా ఈ ఏడాది సింగరేణి కార్మికులకు ఎంత మేలు జరిగిందో అందరూ చూశారు. 

ఇక గుజరాత్ ఎన్నికల ఫలితాలు తెలంగాణాలో కూడా పునరావృతం అవుతాయని భాజపా చాలా ఆశలు పెట్టుకొంది. ముస్లింలకు రిజర్వేషన్ల శాతం 4 నుంచి 12శాతానికి పెంచడానికి తెరాస సర్కార్ చేసిన ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాకపోయినా అది రాజకీయంగా దానికి చాలా మేలు చేకూర్చవచ్చు. 

2017 సంవత్సరంలో తెలంగాణా రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకుపోయి చాలా విజయవంతంగా, సంతృప్తికరంగా ముగించబోతోందని చెప్పవచ్చు. ఈ ఏడాదిలో మొదలుపెట్టిన అనేక నిర్మాణపనులు వచ్చే ఏడాదిలో ముగియబోతున్నాయి కనుక 2018 ఇంకా అద్భుతంగా ఉండబోతోందని ముందే తెలుస్తోంది. 


Related Post