పెద్ది సినిమా అద్భుతంగా ఉందని పొగుడుతున్నవారే దానిలో జాన్వీ కపూర్ అందాల ఆరబోతని ఆమె బూతులు మాట్లాడటాన్ని తప్పు పడుతున్నారు. ఈ విషయం దర్శకుడు బుచ్చిబాబు దృష్టికి రావడంతో అయన వెంటనే స్పందిస్తూ క్షమాపణలు చెప్పుకొని ఆ సన్నివేశాలు తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అది ఆయన మాటల్లోనే...
“ఒక సినీ దర్శకుడిగా సినిమా ప్రేక్షకులను అలరించాలి, ప్రేరేపించాలి, వారితో అనుబంధాన్ని ఏర్పరచాలని కోరుకుంటాను. కానీ ఎప్పుడూ ఎవరికీ అసౌకర్యంగా లేదా అవమానకరంగా భావించేలా ఉండకూడదని కోరుకుంటాను. 'పెద్ది'లో కొన్ని సన్నివేశాలపై వచ్చిన అభిప్రాయాలను మేము పరిశీలించాము.
తెరపైనైనా తెర వెనుకనైనా మహిళల పట్ల నాకు ఎప్పుడూ అపారమైన గౌరవం ఉంది. ఏ మహిళా పాత్రనైనా ఓ వస్తువుగా చూపించడం లేదా అగౌరవపరచడం మా ఉద్దేశం కాదు. అయినప్పటికీ, సినిమాలోని ఏదైనా భాగం అలా భావించబడితే, ఆ భావోద్వేగాలను మేము గౌరవిస్తున్నాము. వ్యక్తమైన ఆందోళనలను అర్థం చేసుకుంటూ, హృదయపూర్వకంగా క్షమాపణలు తెలియజేస్తున్నాము.
వాటిపై వచ్చిన అభిప్రాయాలను సమీక్షించిన తర్వాత వివాదాస్పదంగా భావిస్తున్న భాగాల్లో మార్పులు చేయాలని నిర్ణయించుకున్నాము. ప్రేక్షకులతో ఉన్న అనుబంధం ద్వారానే సినిమా ఎదుగుతుంది. కథలు చెప్పే వారిగా మారుతున్న సామాజిక దృక్పథాలు, సున్నితమైన అంశాల పట్ల మేము బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
ప్రతి మహిళకు సముచిత గౌరవం, విలువ, మర్యాద దక్కాలి. ఆవిధంగానే మహిళలకు బలమైన పాత్రలలు సృష్టించి అందరూ సంతోషించేలా చక్కటి కథలతో సినిమాలు చేయాలనుకుంటున్నాము. పెద్దిపై అభిప్రాయాలను నిజాయితీగా, నిర్మొహమాటంగా మాతో పంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు,” అని బుచ్చిబాబు ట్వీట్ చేశారు.