తెలంగాణా ఐటిశాఖ మంత్రి కేటిఆర్ నిన్న పార్టీ విద్యార్ధి సంఘం నేతలతో మాట్లాడుతూ, “కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రజలు చేసిన పోరాటాల వలననే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా ఇవ్వక తప్పనిసరి పరిస్థితి కలిగిందని అన్నారు. కాంగ్రెస్ పలానలో తెలంగాణా రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని, ఆ పార్టీ నేతలు నేటికీ రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతూనే ఉన్నారని కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా రాష్ట్రానికి మొట్టమొదటి శత్రువు..కనుక దానిని అధఃపాతాళానికి త్రొక్కేయాలని అన్నారు.
మంత్రి కేటిఆర్ చెప్పిన వాటిలో ఏమాత్రం అసత్యం లేదనే సంగతి అందరికీ తెలుసు. కాంగ్రెస్ పాలనలో అసమర్ధత, అశ్రద్ద, అవినీతి అనే మూడు ప్రధాన అవలక్షణాలు ఉండటం సహజమని ప్రజలు కూడా భావించేవారంటే అతిశయోక్తి కాదు. అందుకే కాంగ్రెస్ పార్టీని ప్రజలు పక్కనపెట్టి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న పార్టీలకు అధికారం కట్టబెడుతున్నారు. తెలంగాణాలో కూడా అదే జరిగింది. కనుక కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఉంచాలో ఎవరూ ప్రజలకు చెప్పనవసరం లేదు.
కానీ ఆ వంకతో రాష్ట్రంలో అసలు ప్రతిపక్షాలే ఉండకూడదని తెరాస ఆలోచనలను కూడా ఎవరూ సమర్ధించలేరు. తెదేపాపై ఆంధ్రా ముద్ర, వామపక్షాలపై బూజుపట్టిన సిద్దాంతాల ముద్ర, భాజపాపై మతతత్వ ముద్ర, కాంగ్రెస్ పార్టీపై అవినీతి ముద్ర వేసేసి రాష్ట్రంలో తెరాస తప్ప మరే పార్టీ అధికారానికి పనికిరాదు అన్నట్లుగా మాట్లాడటం సరికాదు. తెరాస సర్కార్ పాలనలో కూడా అవినీతి, నిరంకుశత్వం, ప్రచారార్భాటాలు కాస్త ఎక్కువేనని ప్రతిపక్షాలు, టిజెఎసి వంటి ప్రజాసంఘాలు విమర్శలు గుప్పిస్తున్నసంగతి అందరూ చూస్తూనే ఉన్నారు. తెరాస నేతలు ఆ విమర్శలను పట్టించుకోకుండా ఎదుటపార్టీల అవినీతి గురించి మాట్లాడటం, వాటిని అధఃపాతాళానికి త్రొక్కేయాలనుకోవడం చాలా విడ్డూరంగా ఉంది.
“ప్రజలకు మా పాలన, మేము చేస్తున్న అభివృద్ధి పనులు నచ్చి మళ్ళీ అధికారం కట్టబెడితే ఉంటాము లేకుంటే హాయిగా ఇంటికి వెళ్ళిపోతాము” అన్న నోటితోనే తెలంగాణా రాష్ట్రానికి కేసీఆరే మరో 20-30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మంత్రి కేటిఆర్ పదేపదే చెప్పుకోవడం విడ్డూరమే కదా.
ఇటువంటి రాజరికపు పోకడలు, ఆలోచనలు కేవలం తెరాసకే పరిమితం కావు. ఏపిలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డికి కూడా అటువంటి కోర్కెలే ఉన్నట్లు చాటిచెప్పుకొంటున్నారు. అయితే ఇటువంటి పద్దతులు, ఆలోచనలు, గొంతెమ్మ కోర్కెలు రాచరికవ్యవస్థలో సాధ్యమవుతాయేమో కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధ్యం కావనే సంగతి వారికీ తెలుసు. కానీ అధికారంపై వాంఛ వారిచేత ఆవిధంగా మాట్లడిస్తోందనుకోవాలేమో?
ఒకవేళ తెరాస పాలన బాగుంటే ప్రజలు మళ్ళీ దానికే పట్టం కడతారు. కనుక తాము అధికారంలో చిరకాలం కొనసాగడానికి ప్రతిపక్షాలు లేకుండా పోవాలని కోరుకోవడం కంటే ప్రజారంజకంగా పరిపాలన చేస్తే చాలు. ఎవరిని గెలిపించాలో ఎవరిని పక్కన పెట్టాలో ప్రజలే నిర్ణయించుకొంటారు.