కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక అవడంతో సోమవారం రాత్రి తన మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఆయన నిర్వహిస్తున్న హౌసింగ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖను కేంద్ర మైనింగ్ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ శాఖను టెక్స్ టైల్ మంత్రిగా ఉన్న స్మృతీ ఇరానికి ప్రధాని నరేంద్ర మోడీ కేటాయించారు. వెంకయ్య నాయుడు తన పదవులకు రాజీనామా చేసిన కొద్ది సేపటికే ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్టర్ ద్వారా ఈ విషయం ప్రకటించడం విశేషం. తద్వారా ఆ పదవుల కోసం ఎవరూ ఆశపడి ప్రధాని నరేంద్ర మోడీపై ఒత్తిడి చేయకుండా నివారించినట్లు అయ్యింది.
ఇంతకాలం వెంకయ్య నాయుడు హౌసింగ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖను నిర్వహిస్తున్న కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, సడక్ యోజన వంటి అనేక పధకాలకు అనుమతులు, నిధులు వేగంగా మంజూరు అయ్యేవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా రాజధాని అమరావతి అభివృద్ధి పనుల కోసం వెంకయ్య నాయుడు చాలా కృషి చేశారు. ఇప్పుడు ఆ శాఖలో రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత తగ్గిపోవడం సహజమే.
ఆయన ఏపికి చెందినవారు...ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మంచి అనుబందం ఉంది కనుక సహజంగానే ఏపికి చాలా విషయాలలో సహాయపడేవారు. అలాగని తెలంగాణా రాష్ట్రాన్ని ఎన్నడూ చిన్నచూపు చూడలేదు. తెలంగాణా ప్రభుత్వం, తెరాస ఎంపిలు డిల్లీలో ఎటువంటి సహాయసహకారాలు కోరినా ఆయన తక్షణమే స్పందించేవారు. తన శాఖలోనే కాకుండా మిగిలిన శాఖలలో పనులు చక్కబెట్టడానికి కూడా ఆయన చాలా సహకరించేవారు. కానీ ఇకపై ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకు సహాయపడలేని పరిస్థితి ఏర్పడింది.
అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి కేంద్రమంత్రులుగా ఉన్నప్పటికీ వెంకయ్య నాయుడితో పోలిస్తే సమస్యల పరిష్కారానికి వారు అంత చొరవ చూపరనే అభిప్రాయం వినపడుతుంటుంది. కనుక వెంకయ్య నాయుడు మంత్రి పదవి నిష్క్రమణతో రెండు తెలుగు రాష్ట్రాలు డిల్లీలో ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాయని చెప్పవచ్చు.