ఆ ఒక్క సంతకమే కొంప ముంచబోతోందా?

July 18, 2017


img

యూపిఏ దాని మిత్రపక్షాల తరపున ఉపరాష్ట్రపతి పదవికి గోపాలకృష్ణ గాంధీని అభ్యర్ధిగా ఎంచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక చిన్న తప్పుకు ఇప్పుడు బారీ మూల్యం చెల్లించవలసివచ్చేలా ఉంది. ఆయన మహాత్మా గాంధి మనుమడు..మాజీ ఐఏఎస్ అధికారి..భారత్ దౌత్యవేత్తగా అనేక దేశాలలో పనిచేసిన అనుభవశాలి కనుక ఆయనను అభ్యర్ధిగా నిలబెట్టింది. అయితే 1993 ముంబై బాంబు ప్రేలుళ్ళ సూత్రధారులలో ఒకడైన యాకూబ్ మెమన్ క్షమాభిక్ష పిటిషన్ పై ఆయన కూడా సంతకం చేశారనే విషయం వెలుగులోకి రావడంతో, దేశంపై దాడి చేసి అమాయక ప్రజలను పొట్టన పెట్టుకొన్న ఒక ఉగ్రవాదికి మద్దతు పలికిన వ్యక్తి ఉపరాష్ట్రపతి పదవికి ఏవిధంగా అర్హుడు? అని సోషల్ మీడియాలో చర్చ మొదలవడంతో ఆయనకు మద్దతు ఇస్తున్న పార్టీలు పునరాలోచనలో పడ్డాయి. 

యూపియేకి పార్లమెంటులో ఉన్న ఎంపిల సంఖ్యా బలంతో ఆయన ఎలాగూ గెలువలేరని కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అయినా గాంధీజీ మనుమడిని నిలబెట్టామని గొప్పగా చెప్పుకోవాలనుకొంది. కానీ ఊహించని విధంగా ఇప్పుడు ఈ విషయం బయటకు రావడంతో ఆయనకు మద్దతు పలికిన పార్టీలన్నీ తమ నిర్ణయాన్ని పునః సమీక్షించుకొనే అవకాశం ఉంది. ఆయన ఈరోజే తన నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. 

ఆయన నామినేషన్ వేసిన తరువాత ప్రతిపక్షాలు ఆయనకు మద్దతు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది. దానితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగని మద్దతు ఇస్తే ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. కనుక అవి ఆయనకు మద్దతు ఇస్తాయా లేదో చూడాలి. ఇటువంటి అరుదైన అవకాశం వస్తుందని ఎన్నడూ ఊహించని గోపాలకృష్ణ గాంధీ ఆనాడు చేసిన చిన్న సంతకమే ఇప్పుడు ఆయనకు శాపంగా మారేట్లుంది. 

ఎన్డీయే కూటమి తరపున కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుని అభ్యర్ధిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన కూడా ఈరోజే నామినేషన్ వేయబోతున్నారు. ఎన్డీయే కూటమి, దానికి బయట నుంచి మద్దతు ఇస్తున్న అనేక పార్టీల సహాయంతో ఆయన అవలీలగా విజయం సాధించబోతున్నారు. 


Related Post