దేశంలో మహిళలు, బాలికలు చివరికి వృద్ధ మహిళలు, చిన్నారులపై విచ్చలవిడిగా అత్యాచారాలు జరుగుతున్న ఈ రోజుల్లో 10వ తరగతి చదువుతున్న 14 ఏళ్ళ బాలిక ఒంటరిగా ముంబై వెళ్ళడం ఒక సాహసం..చాలా తెలివితక్కువ పనే అని చెప్పకతప్పదు. మళ్ళీ ఆమె క్షేమంగా ఇంటికి చేరుకోవడం నిజంగా ఆమె, ఆమె తల్లితండ్రుల అదృష్టమే!
హైదరాబాద్ లో నిజాంపేటకు చెందిన నాగరాజు, విజయకుమారి దంపతుల కుమార్తె పూర్ణిమ సాయి. స్థానిక భాష్యం స్కూలులో 10వ తరగతి చదువుతున్న ఆమె జూన్ 7న స్కూలుకు వెళుతున్నానని చెప్పి నేరుగా సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చి ముంబై రైలు ఎక్కేసింది. సినిమాలలో నటించాలనే వ్యామోహమే ఆమె అనాలోచిత నిర్ణయానికి కారణం.
ముంబైలో దాదర్ లో దిగి అక్కడ ఉన్న ఒక సినిమా స్టూడియో ముందు తిరుగుతుండగా కొందరు స్థానికులు అనుమానం వచ్చి ఆమెను ప్రశ్నించగా తాను ఒక అనాధనని, తనపేరు అనికశ్రీ అని, హైదరాబాద్ లో తుకారాం గెట్ వద్దగల సాయిశ్రీ అనాధాశ్రమం నుంచి ముంబై పారిపోయి వచ్చానని చెప్పడం విశేషం. వారు డోంగ్రీలోని బాల సుధార్ గృహ్ లో చేర్పించారు. అప్పటి నుంచి ఆమె అక్కడే ఉంటోంది కానీ తన తల్లితండ్రుల పేర్లు, హైదరాబాద్ లో తన చిరునామా వగైరాలు వారికి తెలుపలేదు. తెలిపి ఉండి ఉంటే ఇంత హడావుడి జరిగి ఉండేదే కాదు.
సుమారు 40 రోజులైనా ఆమె ఆచూకి తెలియకపోవడంతో ఇక్కడ హైదరాబాద్ లో ఆమె తల్లితండ్రులు తీరని మనోవేదన అనుభవించారు. వారి పిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని 14 బృందాలను ఏర్పాటు చేసి ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సహా అనేక ప్రాంతాలలో గాలిస్తున్నారు. ఆ ప్రయత్నాలలో భాగంగానే సైబరాబాద్ పోలీసులు మహారాష్ట్ర పోలీసులకు ఆమె వివరాలు పంపించగా అక్కడి బోయివాడ పోలీస్ స్టేషన్లో ఆమె వివరాలు ఉండటంతో వెంటనే ఆ విషయాన్నీ ఆమె కోసం గాలిస్తున్న తుకారం గెట్ పోలీసులకు తెలియబరిచారు. వారు బాల సుధార్ గృహ్ నిర్వాహకులతో మాట్లాడి పూర్ణిమ సాయి అక్కడే ఉందని రూడీ చేసుకోగానే, ఆమె తల్లితండ్రులకు ఆ విషయం తెలియజేసి ఆమెను తీసుకు వచ్చేందుకు నిన్న ముంబైకు బయలుదేరారు.
పూర్ణిమ సాయి కధ సుఖాంతం అవడం నిజంగా గొప్ప విషయమే. తెలిసీ తెలియని వయసులో పూర్ణిమ సాయి చేసిన అనాలోచిత సాహసం కారణంగా ఆమె తల్లితండ్రులు ఎంత మానసిక వేదన అనుభవించి ఉంటారో ఎవరూ ఊహించలేరు. అంతేకాదు..40 రోజులు గడిచినా ఆమె ఆచూకీని కనుగొనలేకపోయారనే అప్రదిష్ట తెలంగాణా పోలీసులు భరించవలసి వచ్చింది. ఆమె కోసం తెలంగాణా, మహారాష్ట్ర పోలీసులు పరుగులు పెట్టాల్సివచ్చింది.
అంత చిన్న వయసులోనే ఆమెకు సినీవ్యామోహం ఉన్న సంగతి ఆమె తల్లితండ్రులు తెలుసుకోలేకపోయారు. తనకు సినిమాలలో నటించాలనే కోరిక ఉందని ఆమె తల్లితండ్రులకు చెప్పలేదు. తనకు తల్లి తండ్రులు లేరని అనాధనని ఆమె చెప్పడం తల్లితండ్రుల వద్దకు తిరిగివెళ్ళే ఉద్దేశ్యం లేకనో లేదా వారు దండిస్తారనే భయం చేతనో కావచ్చు. అనాలోచితతంగా ముంబై రైలెక్కిన ఆమె ఈవిధంగా అతితెలివి ప్రదర్శించడం విశేషమే. తల్లి తండ్రులు పిల్లలకు మద్య నానాటికీ ఎంత దూరం పెరిగిపోతోందో ఈ సంఘటన చాటి చెపుతోంది.
అయితే తప్పిపోయిన లేదా ఇల్లు విడిచిపెట్టిపారిపోయిన బాలబాలికలందరి కధలు పూర్ణిమ సాయిలా సుఖాంతం కావనే సంగతి పిల్లలు, తల్లితండ్రులు కూడా గ్రహించడం చాలా అవసరం.