కొట్టినా, తిట్టినా అమ్మ అన్నం పెట్టకుండా ఉండదు అన్నట్లు అమెరికా ఎప్పుడూ పాకిస్తాన్ని గట్టిగా హెచ్చరిస్తుంటుంది కానీ ఎప్పటికప్పుడు అవసరమైన నిధులు అందిస్తూనే ఉంటుంది. ఈసారి కూడా మళ్ళీ అలాగే వ్యవహరించింది.
ఉగ్రవాదంపై పోరు కోసం 2017,అక్టోబర్ 1 నుంచి 2018, డిశంబర్ 31వరకు పాకిస్తాన్ కు 400 మిలియన్ డాలర్ల ఆర్ధిక సహాయం అందించడానికి అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. కానీ ఆ నిధులను పొందేందుకు అది ఉగ్రవాదం(హక్కాని నెట్ వర్క్) పై తీవ్రపోరాటం చేస్తున్నట్లుగా అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి దృవీకరించవలసి ఉంటుంది.
పాకిస్తాన్ గత 4 దశాబ్దాలుగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తూనే ఉంది. వారిని భారత్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలపైకి ఉసిగొల్పుతూనే ఉంది. అదేసమయంలో తీవ్రవాదంపై పోరుకు అమెరికా నుంచి ఏటా పన్ను వసూలు చేసుకొంటున్నట్లు భారీగా నిధులు సంపాదించుకొంటూనే ఉంది. ఇప్పుడు కూడా దానికి అమెరికా ప్రభుత్వం 400 మిలియన్ డాలర్ల ఆర్ధిక సహాయం అందించడానికి సిద్దం అయ్యింది కానీ షరతులు వర్తిస్తాయని చెపుతోంది.
అంటే పాక్ పట్ల అమెరికా ప్రదర్శిస్తున్నది కపట ఆగ్రహమేనని..అది భారత్ ను మభ్యపెట్టేందుకేనని అర్ధం అవుతోంది. రక్షణశాఖ కార్యదర్శి దృవీకరణ కూడా అటువంటిదే. అమెరికా ప్రభుత్వమే పాకిస్తాన్ కు 400 మిలియన్ డాలర్ల ఆర్ధిక సహాయం అందించడానికి సిద్దం అయినప్పుడు రక్షణశాఖ కార్యదర్శి వద్దంటే మాత్రం ఆగుతుందా? లేకపోతే అతను వద్దని చెపుతారా? ఇదంతా భారత్ ను మభ్యపెట్టేందుకు ఆడుతున్న నాటకమేనని చెప్పవచ్చు. కానీ భారత్ మీడియా “పాకిస్తాన్ పై అమెరికా ఆంక్షలు” అని హెడ్డింగులు పెట్టుకొని సంతృప్తి పడుతోంది.
డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత పాకిస్తాన్ కు నిధుల ప్రవాహం నిలిచిపోతుందని చాలా మంది ఆశించారు. కానీ ఎవరు అధ్యక్షుడైనా అమెరికా-పాక్ ప్రేమ అచంచాలమైనదని నిరూపిస్తూనే ఉన్నారు. ఎందుకంటే భారత్ కు పక్కలో బల్లెంలాగ పాకిస్తాన్ లేకపోతే భారత్ రక్షణపై ఏటా ఖర్చుచేస్తున్న వేలకోట్ల నిధులను దేశాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, మౌలికవసతుల అభివృద్ధిపై ఖర్చుపెడుతుంది. అప్పుడు అమెరికా కంటే వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. బహుశః ఆ భయంతోనే పాకిస్తాన్ కు ఈపేరుతో నిధులు అందిస్తోందని చెప్పవచ్చు. అమెరికా చెపుతున్నట్లు పాక్ నిజంగానే ఆ నిధులను ఉగ్రవాద నిర్మూలనకే వినియోగించి ఉండి ఉంటే పాక్ లో ఉగ్రవాదం ఎప్పుడో అంతం అయ్యుండేది. అమెరికా అందిస్తున్ననిధులను ఉగ్రమూకల తయారీ, శిక్షణ, వారికి ఆయుధాల సరఫరాకే వినియోగిస్తోందనే ఆరోపణలను ఎవరు కాదనగలరు?