రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలని తెరాస, తెదేపాలు కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తెస్తున్నాయి. ఆ కారణంగా సోమవారం నుంచి మొదలయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాలలోనే దాని కోసం ఓ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని భావిస్తోంది. ఆ వార్త విని తెరాస, తెదేపాలు చాలా సంతోషిస్తున్నాయి. అయితే వాటి ఆశలకు అడ్డుకట్టవేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దం అవుతోంది. పార్లమెంటులో మిత్రపక్షాల మద్దతు కూడగట్టి ఆ బిల్లును వ్యతిరేకించాలని నిర్ణయించింది. రాష్ట్ర విభజన చట్టంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన ఇతర హామీలను ముందు నెరవేర్చాలని పార్లమెంటులో డిమాండ్ చేయబోతున్నట్లు తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి మీడియాకు చెప్పారు. ఏపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా అదే చెపుతున్నారు.
అయితే వారి బాధ అందుకు కాదు. సీట్లు పెంచితే ఫిరాయింపులు ఇంకా జోరందుకొనే ప్రమాదం ఉంది. వాటి వలన అధికారంలో ఉన్న తెరాస, తెదేపాలు ఇంకా బలోపేతం అయ్యే అవకాశం ఉండగా రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఇంకా నష్టపోతుంది. సీట్లు పెరిగితే అధికార పార్టీలకు సంతోషమే. వచ్చే ఎన్నికలలో వాటికి అభ్యర్ధుల నుంచి డిమాండ్ పెరుగుతుంది. కానీ ఫిరాయింపులతో బలహీనపడిన కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లలో అభ్యర్ధులను నిలబెట్టడం..వారిని గెలిపించుకోవడం రెండూ కష్టమే. అయితే ఈ విషయాలన్నీ బయటకు చెప్పుకోనేవి కావు కనుక హామీల అమలు సాకు చూపి అడ్డుకోవాలని నిర్ణయించుకొంది. రెండు తెలుగు రాష్ట్రాలలో భాజపాకు కూడా అభ్యర్ధుల కొరత ఉంది కనుక సీట్ల పెంపు కోసం అది చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందో లేదో చూడాలి.
ఏపిలో ప్రస్తుతం 175 సీట్లు ఉండగా వాటిని 225కు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణాలో ప్రస్తుతం 119 సీట్లు ఉండగా అవి 153కు పెరిగే అవకాశం ఉంది. సీట్లు పెరిగితే తెరాస, తెదేపాతో సహా మరికొన్ని పార్టీలలో ఆశావహులకు రాజకీయ ఉద్యోగాలు దొరుకుతాయి. కానీ సీట్ల పెంపువలన ప్రజలకు కొత్తగా ఒరిగేదేమీ ఉండదు. మరికొంత మంది ఎమ్మెల్యేలని ప్రజలు తమ పన్నులతో పోషించవలసి ఉంటుంది. వారు పదవిలో ఉన్నప్పుడు జీతభత్యాల కోసం, పదవి కోల్పోయిన తరువాత పెన్షన్లు ఇతర సదుపాయాల కల్పన కోసం ప్రజలే తమ జేబులో నుంచి చెల్లించవలసి ఉంటుంది.