రేవంత్ విమర్శల ఎఫెక్ట్: సభర్వాల్ శలవు రద్దు

July 15, 2017


img

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ జనరల్ అకున్ సభర్వాల్ జూలై 16 నుంచి 27వరకు శలవు తీసుకోవాలనుకొన్నారు. కానీ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అనేకమంది ప్రముఖులను మాదకద్రవ్యాల కేసులో విచారణ జరుపవలసి ఉంది కనుక  తన శలవును రద్దు చేసుకొన్నానని మీడియాకు తెలిపారు. ప్రభుత్వంలోని కొందరు పెద్దల ఒత్తిళ్ళ కారణంగానే తాను శలవుపై వెళ్ళబోతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను, ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. తాను శలవు తీసుకోబోతున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రభుత్వానికి తెలియజేశానని, అది హటాత్తుగా నిన్నమొన్న తీసుకొన్న నిర్ణయం కాదన్నారు. ప్రభుత్వం తరపు నుంచి తనపై ఎటువంటి ఒత్తిళ్ళు లేవని, రాష్ట్రంలో మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముఠాలను పట్టుకోమని ప్రభుత్వమే చెపుతోందని అన్నారు. ఈవిషయంలో రాష్ట్ర ప్రభుత్వం తనకు పూర్తి స్వేచ్చనిచ్చి సహకరిస్తోందని అకున్ సభర్వాల్ చెప్పారు. 

అకున్ సభర్వాల్ చెప్పిన మాటలు వాస్తవమో కాదో తెలియదు కానీ ఈ కేసులలో సినీ ప్రముఖులను విచారించవలసిన సమయంలో ఆయన శలవుపై వెళ్ళాలనుకోవడం సహజంగానే అనుమానాలకు తావిచ్చింది. ఈ కేసులలో నోటీసులు అందుకొన్న సినీ ప్రముఖులు అందరూ మంచి పలుకుబడి, ప్రభుత్వంలో పెద్దలతో మంచి పరిచయాలు ఉన్నావారే కావడంతో వారిని కాపాడేందుకే ప్రభుత్వం అకున్ సభర్వాల్ ను శలవుపై పంపిస్తోందని తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. అటువంటి అనుమానాలు వ్యక్తం అయిన తరువాత కూడా ఆయన శలవుపై వెళ్ళి ఉండి ఉంటే వాటిని బలపరిచినట్లు అయ్యేది కనుకనె శలవు రద్దు చేసుకొని ఉండవచ్చు. అది మంచి నిర్ణయమే.   



Related Post