వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. పార్టీ కార్యకర్తలకు మూడు రోజుల శిక్షణా అనంతరం శుక్రవారం రాష్ట్ర కార్యాలయంలో ఎంపిక చేసిన 74 మంది జిల్లా స్థాయి కార్యకర్తలకు ఉత్తరప్రదేశ్ నుంచి రప్పించిన మోటార్ సైకిల్స్ అందజేశారు. ఇక నుంచి వారు తమ తమ నియోజకవర్గాలలో తరచూ పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలను నియమించుకొని పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో భాజపా పరిస్థితి కొంత విచిత్రంగా ఉందని చెప్పకతప్పదు. ఆంధ్రాలో తెదేపాతో పొత్తులు ఉన్న కారణంగా అక్కడ ఎదగలేకపోతోంది. అక్కడ దానికి తెదేపాతో పొత్తులు అడ్డొస్తే తెలంగాణాలో తెరాసతో పొత్తులు పెట్టుకోవాలని లోలోన ఆశ ఉండటంతో తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్రయత్నం చేయలేకపోతోంది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య బలమైన సత్సంబంధాలు కలిగి ఉండటం చేత తెరాసతో తాము ఏవిధంగా వ్యవహరించాలో తెలియని అయోమయంలో రాష్ట్ర భాజపా నేతలున్నారు. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, కేంద్రసంస్థలు కేసీఆర్, చంద్రబాబులను, వారి పరిపాలనను మెచ్చుకొంటున్నప్పుడు, రాష్ట్ర భాజపా నేతలు వారిని, వారి ప్రభుత్వాలను విమర్శిస్తుండటం వలన ఏమి ప్రయోజనం? కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో భాజపా ఈ అయోమయ పరిస్థితి నుంచి బయటపడితే తప్ప అది ఏమి చేసినా ప్రయోజనం ఉండకపోవచ్చు.