తెలుగు సినీ పరిశ్రమలో పూరీ జగన్నాథ్, రవితేజ, చార్మీ వంటి అనేకమంది ప్రముఖులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న మాదకద్రవ్యాల నిరోధక సంస్థ డైరెక్టర్ అకున్ సబర్వాల్ హటాత్తుగా శలవుపై బయలుదేరడం దేనికంటే ఆయనను ఈ కేసులకు దూరంగా ఉంచేందుకేన్ని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసు విచారణ ప్రారంభం అయ్యేముందు ఆయనను శలవుపై పంపడం ద్వారా నోటీసులు అందుకొన్నవారిలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అధికార పార్టీ నేతలకు ఆప్తులైనవారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే తక్షణమే అకున్ సభర్వాల్ శలవును రద్దు చేసి ఈ కేసు విచారణను ఆయనకే అప్పగించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
హైదరాబాద్ ని పట్టి కుదిపివేస్తున్న మత్తుమందులకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలనుకొంటే ప్రభుత్వం చాలా కటినంగా వ్యవహరించవలసి ఉంటుంది.
సినీ పరిశ్రమలో నోటీసులు అందుకొన్నవారందరూ వాటికి అలవాటుపడినవారేనని నిర్దారించడం చాలా తప్పు. కానీ ఆ అలవాటున్న వారినీ గట్టిగా హెచ్చరించడం అవసరమే. ముందుగా నగరంలో మత్తుమందులు సరఫరా చేస్తున్న ముఠాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం చాలా అవసరం. ఈ విషయంలో ప్రభుత్వం ఏమాత్రం రాజీపడినా మాదకద్రవ్యాలు చాప క్రింద నీరులా రాష్ట్రమంతటా విస్తరించే ప్రమాదం ఉంటుంది.