కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రగల్భాలు వింటే ఎవరికైనా నవ్వురాకమానదు. నల్లగొండ జిల్లా రాజుపేటలో నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కేసీఆర్ కి దమ్ముంటే నల్లగొండ జిల్లా నుంచి పోటీ చేయాలి. నేనే ఆయనపై పోటీ చేసి కనీసం 50,000 ఓట్లు మెజారిటీతో గెలుస్తాను. ఈ మూడేళ్ళలో ఆయన ప్రభుత్వం చేసిందేమీ లేదు. మాటలతోనే కాలక్షేపం చేసేశారు. తెరాస పతనం ప్రారంభం అయ్యింది. వచ్చే ఎన్నికలలో అన్ని పార్టీలు ఏకమైనా మా పార్టీని ఓడించలేవు. కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించి అధికారంలోకి రాబోతోంది. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రైతులు, పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది,” అని అన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నవారు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించడం, వారికి సవాళ్లు విసరడం సహజమే. ప్రస్తుతం కోమటిరెడ్డి కూడా అదే చేస్తున్నారు. అయితే ఆయన పలుకుబడి, శక్తిసామర్ధ్యాలు నల్లగొండకే పరిమితమని ఆయన సవాలు ద్వారానే తెలుస్తోంది. కోమటిరెడ్డి గురించి తెలంగాణాలో ఇతర జిల్లాల ప్రజలకు తెలియకపోవచ్చు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ శక్తిసామర్ధ్యాల గురించి నల్లగొండవాసులతో సహా అన్ని జిల్లాల ప్రజలకు బాగా తెలుసు. ఒకవేళ కేసీఆర్ నిజంగానే నల్లగొండ నుంచి పోటీ చేస్తే కోమటిరెడ్డికి మెజారిటీ కాదు..కనీసం 50,000 ఓట్లు కూడా పడకపోవచ్చు.
వచ్చే ఎన్నికలలో తెరాసను ఒంటరిగా ఎదుర్కోలేమని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ తన బద్ధ శత్రువైన తెదేపాతో చేతులు కలపడానికి కూడా సిద్దం అవుతోందనే సంగతి కోమటిరెడ్డి మరిచినట్లున్నారు. కానీ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న భాజపా స్నేహహస్తం చాస్తున్నప్పటికీ తెరాస ఒంటరిగానే పోటీ చేయడానికి మొగ్గు చూపుతోంది. అదే దాని శక్తిసామర్ధ్యాలకు, ఆత్మవిశ్వాసానికి గొప్ప నిదర్శనంగా చెప్పవచ్చు.
ఇక కాంగ్రెస్ పార్టీలో ఎవరితోనూ సఖ్యతలేని కోమటిరెడ్డి ఎప్పుడూ ఏకాకిగానే కనిపిస్తుంటారు. అటువంటి వ్యక్తి తెరాసకు నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏవిధంగా ఓడించగలరు? కనుక కోమటిరెడ్డి ప్రగల్భాలు పలుకుతూ నవ్వులపాలవడం కంటే ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికలలో తెరాసను, ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదుర్కోవడానికి సన్నాహాలు చేసుకొంటే మంచిది.