మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనా పట్ల అసభ్యంగా వ్యవహరించిన తెరాస ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై నిర్భయకేసు పెట్టాలని తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెదేపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “కలెక్టర్ పట్ల తెరాస ఎమ్మెల్యే అసభ్యంగా వ్యవహరిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ అతనిపై కటినమైన చర్యలు తీసుకోకుండా అతనిని కాపాడే ప్రయత్నం చేయడం దురదృష్టకరం. ఆయన తన మంత్రులను కలెక్టర్ ఇంటికి పంపించి కేసు ఉపసంహరించుకొమ్మని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. శంకర్ నాయక్ ఆమెతో అసభ్యంగా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. గత 6 నెలల నుంచి అదేవిధంగా వ్యవహరిస్తున్నారని స్వయంగా కలెక్టరే చెపుతున్నారు. తన పార్టీ ఎమ్మెల్యే ఒక మహిళా అధికారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటే ముఖ్యమంత్రి ఈవిధంగానే స్పందించేది? ఆయనను అరెస్ట్ చేసినట్లు డ్రామా ఆడించి మళ్ళీ వెంటనే విడిచిపెట్టారు. శంకర్ నాయక్ పై నిర్భయకేసు పెట్టాలి,” అని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.
ఏపిలో తెదేపా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులు అక్రమ ఇసుక రవాణా చేస్తునప్పుడు తమను అడ్డుకొన్న తహసిల్దార్ వనజాక్షిపై వారు చెయ్యి చేసుకొన్నారు. అప్పుడు రెండు రాష్ట్రాలలో తెదేపా నేతలు మౌనం వహించారు. ప్రీతి మీనా విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు గట్టిగా హెచ్చరించడమే కాకుండా అయన చేత ఆమెకు క్షమాపణలు కూడా చెప్పించారు. కానీ ఏపి సిఎం చంద్రబాబు తన ఎమ్మెల్యేను వెనకేసుకు వచ్చి ఆ వ్యవహారంలో తహసిల్దార్ వనజాక్షిదే తప్పు అని నిర్ధారించిన సంగతి తెలంగాణా తెదేపా నేతలు మరిచిపోయినట్లున్నారు.