తెరాస నేతలే నాపై కుట్రలు పన్నారు

July 13, 2017


img

మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనాతో అసభ్యంగా వ్యవహరించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేత చివాట్లు తిన్న తెరాస ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన తరువాత స్వంత పూచీకతుపై వెంటనే బెయిల్ పై విడుదలయ్యారు.

తరువాత మీడియాతో మాట్లాడుతూ, “మా పార్టీలో కొందరు నేతలే నాపట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. నాపై కుట్రలు పన్ని ఏమి సాధించాలనుకొంటున్నారో తెలియడం లేదు. పార్టీ అధిష్టానం ఒత్తిడి మేరకే నేను కలెక్టర్ మీనాకు క్షమాపణలు చెప్పాను తప్ప నేనే తప్పు చేయలేదు. కలెక్టర్ ప్రీతి మీనా నాకు సోదరి వంటిది. మేమిద్దరం ఒకే సామాజిక వర్గానికి చెందినవాళ్ళము. ఆమె పట్ల నేను అసభ్యంగా వ్యవహరించలేదు. అయినా పోలీసులు నాపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం నాకు చాలా బాధ కలిగించింది,” అని అన్నారు. 

శంకర్ నాయక్ తను తప్పు చేయకపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం ప్రకారం కలెక్టర్ మీనాకు క్షమాపణ చెప్పానని, పార్టీలో తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని చెప్పడం గమనిస్తే అయన పార్టీపై తిరుగుబాటుకు సిద్దం అవుతున్నట్లున్నారు. ఆయన కారణంగానే జరిగిన ఈ సంఘటనకు ఎవరో కుట్రలు పన్నుతున్నారని ఆరోపించడం విడ్డూరంగా ఉంది. ఏమైనప్పటికీ శంకర్ నాయక్ వలన తెరాసకు, ప్రభుత్వానికి తీరని అప్రదిష్ట కలిగింది. ఆయన చేసిన ఈ పని వలన ప్రతిపక్షాలు తెరాస సర్కార్ ను నిందించడానికి అవకాశం దక్కించి. కనీ ఆయన నేనే తప్పు చేయలేదని వాదించడం వలన ఇంకా ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారని చెప్పకతప్పదు.


Related Post