రాష్ట్రవ్యాప్తంగా పాత జిల్లా కేంద్రాలలో బ్యాంకుల ఎదుట జూలై 14న ధర్నా చేయబోతున్నట్లు తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం రైతుల పంట రుణాలను మాఫీ చేసిందని గొప్పలు చెప్పుకొంటున్నప్పటికీ ఇంతవరకు 4వ విడత రుణమాఫీ నిధులు రైతుల ఖాతాలలో జమా అవ్వలేదని చెప్పారు. ఆ కారణంగా బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు ఇవ్వడం లేదని చెప్పారు. ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటికీ బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టలేకపోతున్నారని చెప్పారు. పొలాలలో పనిచేసుకొంటూ ఉండాల్సిన రైతులు బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తున్నారని ఉత్తం కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కనుక తెలంగాణా ప్రభుత్వం తక్షణమే రుణమాఫీ నిధులను విడుదల చేయాలని కోరుతూ రేపు బ్యాంకుల ముందు కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేస్తాయని ఉత్తం కుమార్ రెడ్డి ప్రకటించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణా ధనికరాష్ట్రమని చెపుతూనే లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి నాలుగు వాయిదాలు పెట్టారు. అయినా ఇంకా నాలుగవ వాయిదా ఇంతవరకు చెల్లించలేకపోయారు. కనుక రైతులలో ఆవేదన, ఆగ్రహం కలుగడం సహజమే. ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి ఆపసోపాలు పడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకేసారి రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని ఉత్తం కుమార్ రెడ్డి ఏవిధంగా హామీ ఇస్తున్నారో ఆయనకే తెలియాలి.
బహుశః రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాలేదనే ధీమాతోనో లేక రావాలంటే ఇటువంటి ఆచరణసాధ్యం కాని హామీని ఇవ్వడం అవసరమని భావించినందునో ఉత్తం కుమార్ రెడ్డి ఈ హామీ ఇస్తున్నట్లు భావించవలసి ఉంటుంది. కనుక ప్రస్తుతం ఆందోళన చెందుతున్న రైతుల పక్కన నిలబడి తెరాస సర్కార్ ని తిట్టిపోస్తూ అదే సమయంలో తాము అధికారంలోకి వస్తే రెండు లక్షలు ఇస్తామని చెప్పడం ద్వారా రైతులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్లుంది.
అయితే కాంగ్రెస్ పార్టీలో ఉత్తం కుమార్ రెడ్డి తప్ప మరెవరూ ఈ రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పకపోవడం గమనార్హం. అంటే పార్టీలో నేతలు కూడా అది సాధ్యం కాదని భావిస్తున్నారనుకోవచ్చు. రుణమాఫీ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం హర్షించవచ్చు కానీ ఆ పేరుతో రైతులను రెచ్చగొట్టి వారికి దగ్గరవ్వాలనుకొంటే ఎవరూ హర్షించలేరు.