కేంద్రప్రభుత్వం అందిస్తున్న నిధులతో అది ప్రవేశపెట్టిన పధకాలకు పేర్లు మార్చి వాటిని తమ స్వంత నిధులతో చేపడుతున్న స్వంత పధకాలుగా తెరాస సర్కార్ చెప్పుకొంటోందని రాష్ట్ర భాజపా అధికార ప్రతినిధి ఎ. రాకేశ్ రెడ్డి విమర్శించారు. కేంద్రప్రభుత్వం స్వచ్చా భారత్ పధకం ప్రవేశపెట్టి దానికి బారీగా నిధులు మంజూరు చేస్తే తెరాస సర్కార్ దానికి స్వచ్చా హైదరాబాద్ అని పేరు మార్చి దానిని స్వంత పదకంగా ప్రచారం చేసుకొంటోందని విమర్శించారు. అదేవిధంగా కేంద్రప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రవేశపెడితే దానిని తెరాస సర్కార్ ‘మేక్ ఇన్ తెలంగాణా’గా మార్చిందని, అలాగే ‘స్కిల్ ఇండియా’ను ‘స్కిల్ తెలంగాణా’గా పేర్లు మార్చి తన స్వంత పధకాలుగా ప్రచారం చేసుకొంటోందని రాకేశ్ రెడ్డి ఆరోపించారు. వాటన్నిటికీ కేంద్రప్రభుత్వమే నిధులు అందిస్తున్నప్పటికీ భాజపాకు, కేంద్రప్రభుత్వానికి న్యాయంగా దక్కవలసిన క్రెడిట్ తెరాస సర్కార్ దక్కనీయడం లేదని రాకేశ్ రెడ్డి విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న యాదవులకు సబ్సీడీపై గొర్రెల పంపకం పధకానికి కూడా కేంద్రప్రభుత్వమే నిధులు మంజూరు చేస్తోందని అన్నారు. కానీ దానినీ తెరాస సర్కార్ స్వంత పధకంగానే గొప్పలు చెప్పుకొంటోందని ఎద్దేవా చేశారు. ఆ పధకంలో 21 గొర్రెలుండే ఒక యూనిట్ కు గరిష్టంగా లక్ష రూపాయలు మాత్రమే చెల్లించాలని కేంద్రప్రభుత్వం సూచిస్తే, తెరాస నేతలకు లబ్ది కలిగించేందుకు ఒక యూనిట్ కు రూ.1.20 లక్షలకు తెరాస సర్కార్ పెంచిందని ఆరోపించారు. గొర్రెల పంపిణీ పధకంలో బారీగా అవినీతి జరుగుతోందని రాకేశ్ రెడ్డి ఆరోపించారు. కేంద్రప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో రాష్ట్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పధకాలలోను ఇదే పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. నిధులు,పధకాలు కేంద్రానివి పేరు తెరాసదా? అని రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు.
సబ్సీడి గొర్రెల పంపిణీకి కూడా కేంద్రప్రభుత్వమే నిధులు సమకూరుస్తోందనే రాకేశ్ రెడ్డి వాదన నిజమో కాదో తెరాస సర్కార్, కేంద్రప్రభుత్వమూ ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది లేకుంటే రాకేశ్ రెడ్డి వాదనలు నిజమని భావించవలసి ఉంటుంది. ఒకవేళ అదే నిజమైతే, రాకేశ్ రెడ్డి చెపుతున్నట్లుగా కేంద్రం అందిస్తున్న నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఆకర్షణీయమైన పధకాలు ప్రవేశపెడుతూ ప్రజలలో మంచి పేరుప్రతిష్టలు సంపాదించుకొంటుండగా సరిగ్గా అదే కారణం చేత రాష్ట్రంలో భాజపా రాజకీయంగా నష్టపోతోందని చెప్పవచ్చు.
అయితే ఈ సమస్య కేవలం తెలంగాణా రాష్ట్రానికే పరిమితం కాలేదు. పొరుగునే ఉన్న ఆంధ్రాతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలలో ఉంది. ఏపి సర్కార్ లో తెదేపా,భాజపాలు భాగస్వాములుగా ఉన్నప్పటికీ ఆ రాష్ట్ర భాజపా నేతలు తరచూ ఇవె ఆరోపణలు చేస్తుంటారు. కనుక భాజపాయే దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు కనుగొనవలసి ఉంది.