కరీంనగర్ బహిరంగ సభలో సిఎం కేసీఆర్ ప్రతిపక్ష నేతలను గొర్రెలు..సన్నాసులు అని మళ్ళీ సంభోదించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షాలలో బలంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీయే. దాని తరువాత భాజపా, తెదేపా, వామపక్షాలు ఉన్నాయి. కనుక సిఎం కేసీఆర్ ప్రతిపక్షాల నేతలని జనాంతికంగా అన్నప్పటికీ అది రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఉద్దేశ్యించి అన్నమాటలే అని అర్ధం అవుతోంది. కేసీఆర్ కాంగ్రెస్ నేతలను ఈవిధంగా సంభోదించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలాసార్లు వాళ్ళని సన్నాసులు అని అన్నారు. ఈసారి గొర్రెలనే మరో బిరుదు కూడా వాళ్ళకి తగిలించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నేతలను ఆవిధంగా అనడం ఎవరూ సమర్ధించరు. ఒకవేళ సమర్ధిస్తే రేపు ప్రతిపక్షాలు ఆయనను అదేవిధంగా సంభోదిస్తే దానినీ అంగీకరించవలసి ఉంటుంది.
సింఎం కేసీఆర్ తమను పదేపదే తమను గొర్రెలు..సన్నాసులు అని సంభోదిస్తున్నా కూడా ప్రతిపక్ష (కాంగ్రెస్) నేతలకు చీమ కుట్టినంత బాధ అయినా కలుగకపోవడం, స్పందించకపోవడం చిత్రంగానే ఉంది. అదే ప్రతిపక్ష నేతలు ఎవరైనా కేసీఆర్ గురించి అనుచితంగా ఒక్క మాట మాట్లాడినా తెరాస నేతలు అందరూ మూకుమ్మడిగా వారిపై ఎదురుదాడి చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వీయ ప్రచారం కోసం ఉపయోగించుకొంటున్నారని విమర్శించిన సీనియర్ కాంగ్రెస్ నేతలు హనుమంతరావు, పొన్నాల ప్రభాకర్ ఇద్దరూ కూడా కేసీఆర్ తమను గొర్రెలు..సన్నాసులు అని సంభోదించినందుకు అభ్యంతరం చెప్పకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వారు ముందుగా కేసీఆర్ మాటలను గట్టిగా ఖండించి ఆ తరువాత మిగిలిన విషయాలు మాట్లాడి ఉండి ఉంటే బాగుండేది. ఇప్పటికైనా వారు అభ్యంతరం చెప్పకపోతే గొర్రెలు విమర్శలకు స్పందించవని సరిపెట్టుకోవలసి ఉంటుంది.