మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతి మీనాతో తెరాస ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచితంగా ప్రవర్తించినట్లు తెలుసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మహబూబాబాద్ లో హరితహారం కార్యక్రమానికి కలెక్టర్ ప్రీతి మీనా హాజరైనప్పుడు శంకర్ నాయక్ ఆమెను బహిరంగంగా దుర్భాషలాడి అవమానించినట్లు తెలుస్తోంది. తమ కళ్ళ ముందే జిల్లా కలెక్టరును ఎమ్మెల్యే అవమానించడంతో రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో వెంటనే మెరుపు ధర్నా చేశారు.
ప్రీతి మీనా కూడా ఎమ్మెల్యేపై ఐఏఎస్ అధికారుల సంఘానికి పిర్యాదు చేయడంతో వారు తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళారు. ఆయన వెంటనే స్పందించి తన ఎమ్మెల్యేకు గట్టిగా వార్నింగ్ ఇవ్వడమే కాకుండా తక్షణం కలెక్టరు మీనా వద్దకు వెళ్ళి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు. అంతేకాదు..శంకర్ నాయక్ తన తీరు మార్చుకోకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. విశేషమేమిటంటే, ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ) ఈవిషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
కలెక్టర్ మీనాతో ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపి సీతారాం నాయక్ మాట్లాడి ఆమెను సముదాయించాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రాజకీయ నేతలు, ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు, పోలీస్ అధికారుల పట్ల అనుచితంగా వ్యవహరించడం పరిపాటి అయిపోయింది. కనుక ముఖ్యమంత్రి కేసీఆర్ తనపార్టీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ విషయంలో కటినంగా వ్యవహరించడం ద్వారా ఆవిధంగా వ్యవహరించేవారిని సహించబోనని పార్టీలో అందరికీ బలమైన సంకేతాలు పంపించినట్లు అయ్యింది.