ప్రపంచ క్రికెట్ ను శాశిస్తున్న మన బిసిసిఐ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవలసివచ్చినా దానిలో ఎంతో కొంత రాజకీయం, కొంత తడబాటు తప్పనిసరి అని టీమ్ ఇండియా కోచ్ ఎంపిక విషయంలో మరోసారి రుజువయింది. కోచ్ పదవి చేపట్టడానికి ముందుకు వచ్చిన ఐదుగురిని ఇంటర్వ్యూలు చేసిన తరువాత వారిలో ఎవరో ఒకరిని ఎంపిక చేసి పేరు ప్రకటించాలి. కానీ కెప్టెన్ విరాట్ కోహ్లీని, మరి కొంతమందితో దీని గురించి చర్చించిన తరువాత తమ నిర్ణయం ప్రకటిస్తామని సెలక్షన్ కమిటీ సభ్యుడు గంగూలి చెప్పడం విడ్డూరంగా ఉంది. భారత్ టీమ్ లో ఉన్నవారి అందరి అభిప్రాయలు తీసుకొని వారికి నచ్చిన వ్యక్తినే కోచ్ గా నియమించదలిస్తే ఇంక ఇంటర్వ్యూలు నిర్వహించడం దేనికి?
తరువాత రవిశాస్త్రిని కోచ్ గా నియమిస్తున్నట్లు చెప్పి మళ్ళీ కొద్దిసేపటికే మీడియాలో వస్తున్న ఆ వార్తలు నిజం కాదని చెప్పడం దేనికి? మీడియాలో వస్తున్న వార్తలు నిజం కావని ఖండించి మళ్ళీ రావిశాస్త్రినే టీమ్ ఇండియా కోచ్ గా నియమిస్తున్నామని చెప్పడంతో బిసిసిఐ నవ్వుల పాలయింది.
బిసిసిఐకి ఎప్పుడూ ఆడంబరమే తప్ప ఏ పనిని లోపాలు లేకుండా నిర్వహించలేదని కోచ్ ఎంపిక ప్రక్రియతో మరోసారి నిరూపించి చూపింది. బిసిసిఐ చైర్మన్, ప్రధాన కార్యదర్శి నియామకాల విషయమలో సుప్రీంకోర్టు చేత మొట్టికాయలు వేయించుకొన్నా దాని పనితీరు మెరుగుపడలేదని ఇది మరోసారి నిరూపించి చూపింది. అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడే మన క్రికెట్ ఆటగాళ్ళు అప్పుడప్పుడు తీవ్ర ఒత్తిడికి లోనయి తడబడుతుంటారు. అది సహజమే. కానీ బిసిసిఐ కూడా ఎందుకు తడబడుతోంది? అది తడబాట అసమర్ధతా? బిసిసిఐ తీరు ఇంకా ఎప్పటికి మెరుగుపడుతుందో..ఏమో?