నేటి నుంచి తెలంగాణా రాష్ట్రంలో 3వ విడత హరితహారం కార్యక్రమం మొదలవుతుంది. 2015లో నిర్వహించిన మొదటి విడత హరితాహారంలో రాష్ట్ర వ్యాప్తంగా 16.49 కోట్ల మొక్కలను నాటగా, 2016లో 32.51 కోట్ల మొక్కలను నాటారు. ఈ ఏడాది ఏకంగా 40 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. వాటిలో 20 శాతం పండ్ల మొక్కలున్నాయి. వాటితో బాటు కొండలు, బండరాళ్ళు ఉన్న ప్రాంతాలలో రావి, మర్రి, చింత వంటి మొక్కలను కూడా నాటబోతున్నారు. అవి కాక ఈసారి ప్రభుత్వ అటవీ భూములు, కొండ ప్రాంతాలలో ‘సీడ్ బాల్ బాంబ్స్’ (మట్టి ఉండలలో విత్తనాలను భద్రపరిచి వర్షాకాలం ముందు వాటిని ఖాళీ స్థలాలో చల్లడం) పద్దతిలో కూడా మొక్కల నాటలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం 60-70 లక్షల సీడ్ బాల్ బాంబ్స్ సిద్దం చేశారు.
మరికొద్ది సేపటిలో ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ లో లోయర్ మానేరు డ్యామ్ వద్ద మొక్కలునాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
గత రెండేళ్ళలో హరితహారం ఫలితాలను సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఈసారి దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఈసారి నుంచి ప్రజా ప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటిన తరువాత అంతటితో తమ పని అయిపోయిందని చేతులు దులుపుకోకుండా ఏడాది పొడవునా మొక్కల సంరక్షణ భాద్యతలను కూడా వారికి అప్పగించారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ ప్రాంతాల వారిగా ప్రజలు, విద్యార్ధులతో కూడిన గ్రీన్ బ్రిగేడ్స్ ఏర్పాటు చేసి వారికి ఈ మొక్కల సంరక్షణ బాధ్యత అప్పగించారు. ఆ గ్రీన్ బ్రిగేడ్స్ కు స్థానిక ఎమ్మెల్యే లేదా ప్రజా ప్రతినిధులు నేతృత్వం వహిస్తారు. వారికి స్థానిక మున్సిపల్ అధికారులు సహకరిస్తారు.
మొక్కల సంరక్షణకు బాగా కృషిచేసిన వారికి హరిత మిత్ర అవార్డు, దానితో బాటు రూ.1 నుంచి 15 లక్షల నగదు బహుమతులు అందజేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇక స్కూల్ విద్యార్ధులకు 5 గ్రేస్ మార్కులు కలపాలని నిర్ణయించారు. తెలంగాణా రాష్ట్ర విస్తీర్ణంలో కనీసం 33 శాతం పచ్చదనం నింపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు.
హరితహారం పధకం విజయవంతం అయ్యేందుకు ఈసారి ప్రభుత్వం తీసుకొన్న అదనపు జాగ్రత్తలు, అందించబోతున్న ప్రోత్సహాకాల వలన వచ్చే ఏడాదికి మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంది.
అయితే రాష్ట్రంలో పచ్చదనం పెంచడానికి ప్రభుత్వం హరితహారాన్ని ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తుంటే మరోపక్క రియల్ ఎస్టేట్ సంస్థలు లేఅవుట్ల కోసం పెద్దపెద్ద చెట్లను విచ్చలవిడిగా నరికివేస్తున్నాయి. రోడ్లు, కాలువలు నిర్మించేటప్పుడు ఆ శాఖ ఉద్యోగులు కూడా రోడ్డు పక్కన పెరిగిన పెద్ద వృక్షాలను నిర్ధాక్షిణ్యంగా నరికివేస్తున్నారు. వర్షాకాలం రాగానే ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటుతుంటే సరిగ్గా ఇదే సమయంలో విద్యుత్ శాఖవారు కరెంటు తీగలకు కొమ్మలు తగులుతున్నాయని చెట్ల కొమ్మలను నరుకుతుంటారు. అనేక చోట్ల చెట్ల కొమ్మలు నరికే కార్మికులు పైకి ఎక్కి కొమ్మలు నరకకుండా చెట్టు మొదలునుంచే నిర్దాక్షిణ్యంగా నరికివేస్తుంటారు. కనుక ప్రభుత్వం మొక్కలు నాటడం, వాటి సంరక్షణతో బాటు ఇటువంటి విద్వంసాన్ని కూడా అరికట్టినప్పుడే పచ్చదనం కనబడుతుంది.
అలాగే ఈ 3 విడతలలో ఎన్ని కోట్ల చెట్లు వేశారనే లెక్కలు అధికారులు బాగానే చెపుతున్నారు కానీ గత రెండేళ్ళ వేసినవాటిలో ఎన్ని బ్రతికి ఉన్నాయి. ఎన్ని ఆరోగ్యంగా ఎదిగాయి. ఎదగక పోయుంటే దానికి కారణాలు ఏమిటి? వంటి వివరాలు కూడా చెప్పగలిగే విధంగా పర్యవేక్షణ, లెక్కలు నిర్వహించడం చాలా అవసరం. అప్పుడే హరితహారం విజయవంతం అవుతుంది.