సిక్కింలో చైనా సేనలు మన సైనికులపై దౌర్జన్యం చేస్తుంటే భారతీయులు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కానీ ‘మేడిన్ చైనా’ మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, గృహోపకరణాలు ఇతర వస్తువులు కొనడానికి పోటీ పడుతుంటారు. భారతీయుల ఈ బలహీనతే చైనాకు వరంగా మారింది. యావత్ ప్రపంచదేశాలలో చైనాకు అతిపెద్ద మార్కట్ మనదేశమే. చైనా నుంచి ఏటా భారత్ కు 58.33 బిలియన్ డాలర్ల విలువగల దిగుమతులు జరుగుతున్నాయి. ఒక బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు వంద కోట్లు. ఆ లెక్కన ఏడాదికి 58.33 బిలియన్ డాలర్లు అంటే ఎంతో లెక్క వేసుకోవచ్చు. మనదేశీయ పరిశ్రమలకు ఏటా అంత నష్టం జరుగుతోందన్నమాట!
అదే..భారత్ నుంచి చైనాకు కేఅలం 11.76 బిలియన్ డాలర్ల ఉత్పత్తులు మాత్రమే ఎగుమతి చేస్తున్నాము. అది కూడా మొబైల్ ఫోన్లు, కార్లు, యంత్రాలు వంటివి కావు. గోధుమలు, పంచదార వంటి ఆహార వస్తువులు మాత్రమే. వాటి వలన చైనాకు లాభమే తప్ప ఎటువంటి నష్టమూ లేదు.
చైనా ఉత్పత్తులను కొనడం ద్వారా మన పరిశ్రమలను, వాటిపై ఆధారపడి బ్రతుకుతున్న లక్షలాది సాటి భారతీయులను, చివరికి మన ఆర్ధిక వ్యవస్థను మనమే దెబ్బ తీసుకొంటున్నామన్న మాట! దేశంలో ప్రజలందరూ తమకు చాలా దేశభక్తి ఉందని గట్టిగా నమ్ముతుంటారు. కానీ దేశంలోని పరిశారమలను తద్వారా మన ఆర్ధిక, సామాజిక వ్యవస్థలను దెబ్బ తీస్తున్నచైనా వస్తువులపై మోజు తగ్గకపోవడం చాలా విచారకరమే.
చైనాతో యుద్ధం వస్తే ఏమవుతుందో తెలియదు కానీ ఈ చైనా ఉత్పత్తుల వలన దేశంలో కనబడని విద్వంసం ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వాలకు, వాటిని నడుపుతున్న రాజకీయ పార్టీలకు ఈవిషయం తెలిసి ఉన్నప్పటికీ అనేక కారణాల చేత అవి కూడా దీనిని చూడనట్లు కళ్ళుమూసుకొంటున్నాయి. కానీ ముంబైలోని పాఠశాలలు చైనాపై పోరాటం మొదలుపెట్టడం విశేషం. నగరంలోని అన్ని ప్రధాన పాఠశాలల యాజమాన్యాలు, ప్రదానోపాద్యాయులు సమావేశమయ్యి చైనా వస్తువులు వలన మన దేశానికి కలుగుతున్న నష్టాలను తమ విద్యార్ధులకు వివరించి ఇకపై ఎవరూ వాటిని కొనవద్దని నచ్చజెప్పాలని నిర్ణయించాయి. ‘సే నో టు చైనా ప్రొడక్ట్స్’ అనే నినాదంతో ప్రజలను చైతన్య పరచాలని నిర్ణయించాయి. చేతిలో పదవీ, అధికారం అన్నీ ఉన్న మన నేతలు చేయలేని పనిని చిన్నారి విద్యార్ధులు చేయడానికి సిద్దం అవుతున్నారు. ఇకనైనా మనం కూడా వారి ఉద్యమంలో పాలు పంచుకొని చైనా మొబైల్స్, వస్తువులను కొనడం మానుకోగలమా?