ఇంతకీ కోదండరామ్ ఎందుకు పోరాడుతున్నారు?

July 11, 2017


img

టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అమరవీరుల స్పూర్తియాత్రలో భాగంగా సోమవారం సిరిసిల్లాలో పర్యటించారు. అక్కడ ప్రజలను, మీడియాను ఉద్దేశ్యించి మాట్లాడుతూ తెరాస సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందంటూ విమర్శలు చేశారు. తెలంగాణా ఏర్పడినప్పటికీ ప్రజల ఆకాంక్షల ప్రకారం అభివృద్ధి జరుగడం లేదన్నారు. ఇంకా అనేక సమస్యలను ప్రస్తావించి తెరాస సర్కార్ పై విమర్శలు గుప్పించారు. 

ప్రొఫెసర్ కోదండరామ్ కాంగ్రెస్ ఏజంటులాగ వ్యవహరిస్తూ తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని తెరాస నేతలు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో రెడ్డి కులస్తులకు అన్యాయం జరిగిందని భావిస్తూ ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి తమ ప్రభుత్వంపై ఈవిధంగా కక్ష కట్టారని ఎంపి జితేందర్ రెడ్డి ఆరోపించారు. కానీ తాను ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే వాటిని సహృదయంతో స్వీకరించకుండా తెరాస సర్కార్ తనపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపిస్తున్నారు. 

‘బంగారి తెలంగాణా’ అనే ఆలోచన చేసిందే ముఖ్యమంత్రి కేసీఆర్ అని అందరికీ తెలుసు. కనుక తమ ప్రభుత్వం దానిని సాధించేందుకే గట్టిగా కృషి చేస్తోందని తెరాస మంత్రులు, ప్రజా ప్రతినిధులు వాదిస్తున్నారు. తాను కూడా బంగారి తెలంగాణా సాధన కోసమే పోరాడుతున్నానని ప్రొఫెసర్ కోదండరామ్ చెపుతుంటారు. అందరి లక్ష్యం ఒకటే కానీ ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోరు. అందుకు ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. 

ప్రొఫెసర్ కోదండరామ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఆయన నిరంతరంగా తెరాస సర్కార్ పై చేస్తున్న విమర్శలు, అవినీతి ఆరోపణల ద్వారా ఏమి సాధించదలచుకొన్నారు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పవలసి ఉంది. ఒకవేళ ప్రజలలో చైతన్యం తీసుకురావడం ఆయన లక్ష్యమయితే అది తెరాస సర్కార్ పట్ల ప్రజలలో  వ్యతిరేకత కల్పించడమే అవుతుంది. అంటే వచ్చే ఎన్నికలలో తెరాస ఓటమి కోసం ఆయన కృషి చేస్తున్నట్లు అనుమానించవలసి వస్తుంది. కానీ తనకు ఎటువంటి రాజకీయ ఆలోచనలు లేవని ఆయన చెపుతుంటారు. 

ఒకవేళ ఈవిధంగా తెరాస సర్కార్ లోపాలను వేలెత్తి చూపిస్తూ దానిని సరైన మార్గంలో నడిపించాలనుకొంటున్నట్లయితే అది సాధ్యం కాదని ఇప్పటికే నిరూపితమైంది. ఎందుకంటే రాష్ట్రాభివృద్ధి కోసం తాము చాలా చిత్తశుద్ధితో, పారదర్శకంగా అవినీతిరహితంగా కృషి చేస్తున్నామని తెరాస సర్కార్ గట్టిగా వాదిస్తోంది కనుక. 

కనుక ప్రొఫెసర్ కోదండరామ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం ద్వారా ఏమి సాధించదలచుకొన్నారో స్వయంగా ప్రజలకు వివరించినట్లయితే ఆయన ఎందుకు ఎవరి కోసం పోరాడుతున్నారో అందరికీ అర్ధం అవుతుంది.


Related Post