ప్రభుత్వాల ప్రజావ్యతిరేక నిర్ణయాలపై గట్టిగా పోరాడుతున్న పార్టీలు ఏవంటే వామపక్షాలని చెప్పక తప్పదు. బస్సు చార్జీలు, విద్యుత్ చార్జీలు పెంచినా, పెట్రోల్ ధరలు పెరిగినా రోడ్లపై మొట్టమొదట కనబడేది ఎర్రజెండాలే. కానీ వామపక్షాలు ప్రజల కోసం అంతగా పోరాడుతున్నా ఎన్నికలలో వాటిని ప్రజలు అసలు పట్టించుకోరు. అందుకు కారణం అవి వర్తమాన పరిస్థితులను గమనించకుండా బూజుపట్టిన సిద్దాంతాలను పట్టుకొని వ్రేలాడుతుండటమే అని చెప్పవచ్చు. కాంగ్రెస్, భాజపా వంటి జాతీయ పార్టీలు, తెరాస,తెదేపా, అన్నాడిఎంకె వంటి ప్రాంతీయ పార్టీలు విజయవంతం అవుతున్నప్పుడు స్వాతంత్ర్యం రాకమునుపు నుంచి ఉన్న వామపక్షాలు ఎందుకు విఫలం అవుతున్నాయి? ప్రజలు తమను ఎందుకు ఆదరించడం లేదు? అని వామపక్ష మేధావులు ప్రశ్నించుకొని ఉండి ఉంటే వారికే సమాధానం దొరికేది. అవి ఎప్పటికైనా ఏ రాష్ట్రంలోనైనా అధికారంలోకి రావాలనుకొంటే ముందుగా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా తమ ఆలోచనలను, వ్యవహార శైలిని మార్చుకోవలసి ఉంటుంది.
కానీ ఆ ప్రయత్నం చేయకుండా మరో ఐదేళ్ళలో సిపిఐ, సిపిఎం పార్టీలు విలీనం చేయడం ద్వారా దేశంలో బలపడాలనుకొంటున్నట్లు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి చెప్పారు. “1964లో వామపక్షాలు విడిపోయాయి. కానీ ఆ నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. రెండు పార్టీలు మనుగడ సాగించాలంటే కలిసి పనిచేయక తప్పదు. మా రెండు పార్టీల లక్ష్యం ఒక్కటే కానీ మార్గాలు వేరు కావడం వలన ఇంతకాలం దూరంగా ఉండిపోయాము. మేము కలిసి పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని భావిస్తున్నాము. వచ్చే ఏడాది మా రెండు పార్టీల అగ్రనేతలు సమావేశమైనప్పుడు విలీనం గురించి చర్చించే అవకాశం ఉంది,” అని అన్నారు.