కేసీఆర్ అశోక చక్రవర్తి వంటివారు

July 11, 2017


img

దేశంలో అన్ని రాష్ట్రప్రభుత్వాలు వర్షాకాలం రాగానే మొక్కలు నాటే కార్యక్రమాలు మొదలుపెడుతుంటాయి. తెలంగాణా ప్రభుత్వం కూడా ప్రస్తుతం అదే పని చేయబోతోంది. కానీ తెరాస సర్కార్ ఏ పని చేసినా అటువంటి పనిని దేశంలో ఇంతకు ముందు ఎవరూ చేయలేదు..మేము చేస్తున పని చరిత్రాత్మకం..అంటూ తెరాస నేతలు డప్పుకొట్టుకోవడం నిత్యం వింటున్నదే. చివరకి మంత్రులు తుమ్మినా దగ్గినా కూడా చరిత్రాత్మకం అనే స్థాయిలో భజన కొనసాగుతోంది. రాజకీయ పార్టీలకు అది అలవాటే కనుక తెరాస నేతలను తప్పు పట్టలేము. అయితే పదేపదే ‘ప్రతీ పనిని చరిత్రాత్మకం’ అని చెప్పుకొంటుంటే నిజంగా చారిత్రాత్మకమైన గొప్ప పనులు చేసినప్పుడు వాటికి ‘నాన్న పులి వచ్చె..’ కధలోలాగ ప్రాధాన్యత లేకుండాపోవచ్చు. అందుకే చారిత్రాత్మకానికి పర్యాయపదాలు లేదా ప్రత్యామ్నాయాలు కనుగొనవలసిన అవసరం ఏర్పడింది. 

తెరాస ఎమ్మెల్సీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి కర్నే ప్రభాకర్ అటువంటిది ఒకటి కనుగొన్నారు. కరీంనగర్ లో రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ ‘హరితహారం’ మొక్కలు నాటే కార్యక్రమం మొదలుపెట్టబోతున్నారు. దాని గురించి తెరాస ఎల్పి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ఈసారి 40 కోట్లు మొక్కలు నాటి రాష్ట్రంలో పచ్చదనం పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు. ఆయన అలనాటి అశోక చక్రవర్తి వంటివారని చెప్పవచ్చు. అలనాడు అశోక చక్రవర్తి దేశమంతటా మొక్కలు నాటించి పచ్చదనం పెంచారో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అదేవిధంగా రాష్ట్రంలో పచ్చదనం పెంచాలని పట్టుదలగా ఉన్నారు,” అని చెప్పారు. 

కేసీఆర్ ను అశోక చక్రవర్తితో పోల్చినందున ప్రతిపక్షాలు “అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ రాచరికపోకడలు ప్రదర్శిస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని” ఎద్దేవా చేసినా ఆశ్చర్యం లేదు. కనుక చారిత్రాత్మకానికే ఫిక్స్ అయిపోవడం మంచిదేమో?


Related Post