రాజకీయ పార్టీలు ప్రతీ ఏటా సభ్యత్వనమోదు కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టి కొత్త సభ్యులను పార్టీలో చేర్చుకొంటుంటాయి. ఆ తరువాత కూడా పార్టీలలో నేతల చేరికలు కొనసాగుతూనే ఉంటాయి. ఇవన్నీ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఆమోదయోగ్యమైనవే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పినపాక గ్రామంలో నివాసం ఉంటున్న 400 కుటుంబాలు సోమవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరులు సమక్షంలో తెరాసలో చేరిపోయారు. ఒక గ్రామంలో ప్రజలందరూ ఒకే పార్టీలో చేరిపోవడం విశేషమే.
అయితే ఇంతవరకు ప్రజలను ఓటర్లుగా మాత్రమే చూసే రాజకీయ పార్టీలు ఇప్పుడు వారిని పార్టీ కార్యకర్తలగా మార్చాలనుకోవడం సరికాదు. అసలు రాజకీయాల పట్ల ఆసక్తి లేనివారిని వాటితో సంబంధం లేని సామాన్య ప్రజలను నయాన్నో భయన్నో పార్టీలలో చేర్చుకోవాలనే ఆలోచనే తప్పు. రాష్ట్రంలోని ప్రజలందరూ తప్పనిసరిగా ఏదో ఒక పార్టీ చేరకతప్పని పరిస్థితి ఏర్పడితే, ఇంతవరకు కులాలు, మతాలు, బాషలు, ప్రాంతాలవారీగా చీలిపోయున్న ప్రజల మద్య మరిన్ని చీలికలు ఏర్పడతాయి. క్రమంగా ప్రజలందరూ పార్టీల వారిగా చీలిపోతే సమాజంలో అశాంతి, వారి మద్య వైషమ్యాలు ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు ప్రతీ చిన్న విషయం కూడా రాజకీయ రంగు పులుముకొనే ప్రమాదం ఉంటుంది. రాజకీయాల పట్ల ఆసక్తి గలవారు ఎలాగూ వారంతట వారే ఏదో ఒక పార్టీలో చేరుతుంటారు కనుక రాజకీయ పార్టీలు సామాన్య ప్రజలను వారి మానాన్న వారిని బ్రతకనిస్తే వాటికీ సమాజానికి కూడా చాలా మంచిది.