బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, అయన కుమారుడు బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఇళ్ళపై గత శుక్రవారం సిబిఐ దాడులు చేయడంతో తేజస్విని తక్షణం పదవిలో నుంచి తొలగించాలని రాష్ట్ర భాజపా డిమాండ్ చేస్తోంది.జెడియు, ఆర్.జెడిలు మిత్రపక్షాలుగా, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా కొనసాగుతున్నప్పుడు తమ ఇళ్ళపై సిబిఐ అధికారులు దాడులు చేస్తుంటే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పట్టనట్లు మౌనంగా చూస్తుండిపోయారని లాలూ అండ్ కో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మోడీకి దగ్గరవడం మొదలైన తరువాతే తమపై ఈ కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయని లాలూ భావిస్తున్నారు కానీ ఇంతవరకు నితీష్ కుమార్ ను పేరుపెట్టి నేరుగా విమర్శించలేదు. సిబిఐ కేసులను ఎదుర్కొంటున్న కారణంగా తన కొడుకు రాజీనామా కోసం ప్రతిపక్షాల ఒత్తిడి చేస్తుండటంతో లాలూ ప్రసాద్ సోమవారం తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యి ఈ సమస్య గురించి చర్చించారు. అనంతరం తన కొడుకు రాజీనామా చేయబోడని లాలూ ప్రసాద్ ప్రకటించారు.
ఒకవేళ రాజీనామా చేసినట్లయితే అధికారం చేజారిపోవడమే కాకుండా కొడుకుకున్న అధికార రక్షణ కవచం కూడా తొలగిపోతుంది. అప్పుడు అతనిని సిబిఐఅధికారులు సులువుగా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయే ప్రమాదం ఉంటుందని లాలూ భావించి ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు.
అయితే లాలూ అండ్ సన్స్ తో విసుగెత్తిపోయున్న నితీష్ కుమార్ వారిని ఏదోవిధంగా వదిలించుకొని భాజపాతో చేతులు కలపాలని భావిస్తున్నారు కనుక రేపు ఆయన కూడా తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఆ సమావేశంలో తేజస్వి యాదవ్ ను మంత్రి పదవి నుంచి తొలగించాలని నిర్ణయించినట్లయితే, లాలూ అండ్ నితీష్ బంధం తెగిపోయే అవకాశం ఉంది.