ఎన్నికలకు ఇంకా రెండేళ్ళు ఉన్నాయి. కానీ అన్ని పార్టీలు అప్పుడే ఎన్నికల మూడ్ లోకి వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతిపక్షాలలో ఈ వేడి మరికాస్త ఎక్కువగా కనబడుతోంది. ఏపిలో ఏకైక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైకాపాకు అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరులో నిన్న జరిగిన ప్లీనరీ ముగింపు సమావేశాలలో 2019-ఎన్నికల వాగ్ధానాలు ప్రకటించేశారు. అవేమిటంటే:
1. వైస్ఆర్ రైతు భరోసా పధకం: దీని క్రింద రాష్ట్రంలో రైతులు అందరికీ ఒక్కొక్కరికీ రూ.50,000 చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తాము.
2. వైస్ఆర్ ఆసరా పధకం: దీని క్రింద రాష్ట్రంలో 89 లక్షల మంది డ్వాక్రా మహిళల రుణాలను నాలుగు దశలలో రద్దు చేసి మళ్ళీ వడ్డీ లేకుండా రుణాలు అందజేస్తాము.
3. పెన్షన్లు: వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రస్తుతం అందిస్తున్న నెలకు రూ.1,000 పెన్షన్లను నెలకు రూ.2,000 చొప్పున చెల్లిస్తాము.
4. అమ్మ ఒడి: ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రతీ కుటుంబంలో ఇద్దరు పిల్లలకు నెలకు రూ.500 చొప్పున మొత్తం రూ.1,000 ఇస్తారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక్కొక్కరికీ నెలకు రూ.750 చొప్పున మొత్తం రూ.1,500, ఇంటర్ విద్యార్ధులకు ఒక్కొక్కరికీ నెలకు రూ.1,000 చొప్పున ఇద్దరికీ కలిపి నెలకు రూ.2,000 అందజేస్తాము.
5. హౌసింగ్ : రాష్ట్రంలో పేదల కోసం 25 లక్షల ఇళ్ళు నిర్మిస్తాము.
6. ఆరోగ్యశ్రీ పధకం: ఆరోగ్యశ్రీ పధకాన్ని పునరుద్దరించి అవసరమైన నిధులు కేటాయిస్తాము. కిడ్నీ వ్యాధులకు ప్రత్యేక పెన్షన్ చెల్లిస్తాము. కుటుంబ పెద్ద అనారోగ్యానికి గురైతే కుటుంబానికి పెన్షన్ అందిస్తాము.
7. ఫీజు రీ ఇంబెర్స్మెంట్: బిసి తదితర కులాల పేద విద్యార్ధులు ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యలభ్యసించేందుకు గాను వారి ఫీజులను పూర్తిగా మేమే భారిస్తాము. అదనంగా ప్రతీ విద్యార్ధికి ఏడాదికి రూ.20,000 రూమ్ అద్దె వగైరా ఖర్చుల కోసం చెల్లిస్తాము.
8. జల యజ్ఞం: రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులను వేగంగా నిర్మించి రైతులందరికీ నీళ్ళు అందిస్తాము.
9. మద్యపాన నిషేధం: మూడు దశలలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుచేస్తాం.
ఈ హామీలన్నీ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెదేపా సర్కాకు గుండెల్లో గుబులు పుట్టించేవే. కనుక వీటి కంటే ఇంకా పెద్ద పెద్ద హామీలు గుప్పించవలసి వస్తుంది. వీటిపై ఏపి సిఎం చంద్రబాబు నాయుడు, తెదేపా మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఇంకా స్పందించవలసి ఉంది.