కాంగ్రెస్ పాలనతో పోలిస్తే తెరాస సర్కార్ పాలన బాగానే కనిపిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమాంతరంగా సాగుతున్నాయి. అది అమలుచేస్తున్న పలు పధకాలను కేంద్రప్రభుత్వం నుంచి కూడా శభాషీలు అందుకొంటోంది. అది చూసి ఇరుగు పొరుగు రాష్ట్రాలు కూడా వాటిని అమలు చేస్తున్నాయి. అంతా బాగానే కనిపిస్తోంది. కానీ ప్రజలలో ఇంకా అసంతృప్తి కనిపిస్తుండటం విశేషం.
గత ప్రభుత్వాలతో పోలిస్తే తెరాస సర్కార్ చాలా బాగా పనిచేస్తున్నప్పటికీ ప్రజలలో కేసీఆర్ పాలన పట్ల ఎందుకు వ్యతిరేకత కనబడుతోంది? అంటే కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. 1. హామీల అమలులో వైఫల్యం. 2. నిరంకుశత్వం. 3. సంక్షేమ పధకాలు ఆచరణలో విఫలం అవుతుండటం. 4. రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి నానాటికీ అధ్వానంగా మారుతుండటం.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, దళితులకు మూడెకరాల భూమి, కేజీ టు పిజి ఉచిత నిర్బంద విద్య, పంట రుణాల మాఫీ వంటి అనేక హామీల అమలులో తెరాస సర్కార్ వైఫల్యం చెందిన మాట వాస్తవం. ఆ హామీలను నిలబెట్టుకోలేకపోయినా ప్రజలు సహించగలరు కానీ అమలుచేయకుండా వాటి గురించి తెరాస మంత్రులు, నేతలు గొప్పలు చెప్పుకోవడం సహించలేకపోతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ విషయంలో తెరాస సర్కార్ చేసింది గోరంత కానీ చెప్పుకొంటుంది కొండంతా అన్నట్లుంది.
ప్రతిపక్షాల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రదర్శిస్తున్న నిరంకుశత్వం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తున్నాయి. అదేవిధంగా ఇటువంటి సమస్యలను ఎత్తి చూపిస్తున్న మీడియాను ప్రభుత్వం శత్రువుగా భావించకుండా తన దృష్టికి రానివాటిని గుర్తించేందుకు సహాయపడుతున్న శ్రేయోభిలాషులుగా భావిస్తే మంచిది. ప్రభుత్వంపై నిష్కారణంగా విషం కక్కుతున్న మీడియాను తప్పకుండా ఖండించవలసిందే కానీ దానిలో శ్రేయోభిలాషులను కూడా శత్రువులుగా భావించి దాని నోరు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికే నష్టం అని గ్రహించాలి.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు కొత్తగా ప్రకటిస్తున్న సంక్షేమ పధకాలు ఆచరణలో కనబడటం లేదు. కొన్ని పాక్షికంగా అమలవుతుంటే మరికొన్ని అసలు అమలుకు నోచుకోవడం లేదు.
ఉదాహరణకు బాలింతలకు కేసీఆర్ కిట్స్ పంపిణీ, యాదవులకు గొర్రెల పంపిణీ, ఒంటరి మహిళలకు పెన్షన్ల పంపిణీలో ఎదురవుతున్న అనేక అవరోధాల కారణంగా ఆశించిన స్థాయిలో అవి అమలవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రకటించిన పధకాలు సమర్ధంగా అమలుకానప్పుడు ప్రతిపక్షాలు విమర్శలు చేయకుండా ఉండవు. వాటి కోసం ఎదురుచూపులు చూసి నిరాశ చెందుతున్న ప్రజలలో ప్రభుత్వం పట్ల అపనమ్మకం, అనుమానాలు కలుగక మానవు. కనుక ప్రభుత్వం కొత్త కొత్త పధకాలు ప్రకటించే బదులు ఉన్నవాటిని సమర్ధంగా అమలుచేయగలిగితే ప్రజల నమ్మకం పొందగలుగుతుంది.
ఇక మిషన్ కాకతీయ, చిన్నాపెద్దా సాగునీటి ప్రాజెక్టులు, చెక్ డ్యాముల నిర్మాణాలను చురుకుగా పూర్తి చేస్తూ రైతులకు నీళ్ళు అందించేందుకు తెరాస సర్కార్ గట్టి ప్రయత్నాలు చేస్తున్న మాట వాస్తవం. దాని ప్రయత్నాల వలన ఈ ఏడాది పంటలు బాగా పండాయి. కానీ వాటికి గిట్టుబాటు ధరలు రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిర్చి రైతులే అందుకు ప్రత్యక్ష ఉదాహారణ. ఆ ఆగ్రహంతో కొందరు రైతులు ఖమ్మం మార్కెట్ యార్డు కార్యాలయంపై దాడి చేసి విద్వంసం సృష్టిస్తే వారిపై ప్రతిపక్షపార్టీల ముద్రలు వేసి అరెస్ట్ చేయడం, జైలుకు పంపడం, వారి చేతులకు బేడీలు వేసి నడిరోడ్డుపై తిప్పడం వంటి చర్యలు రైతన్నలలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను సృష్టించడం సహజం.
ఇక ఈ ఖరీఫ్ సీజనులో రాష్ట్రంలో చాల మంది రైతులు పత్తి పంట వేస్తున్నారు. వారి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొంటే మంచిది లేకుంటే రైతాంగంలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. తెరాస సర్కార్ ఇటువంటి లోపాలను సవరించుకొని ముందుకు సాగడం చాలా అవసరం లేకుంటే ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంది.