గుంటూరులో ఆదివారం జరిగిన వైకాపా ప్లీనరీ ముగింపు సమావేశాల రోజున ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చాలా కీలకమైన నిర్ణయాలు ప్రకటించారు.
ఈ ఏడాది అక్టోబర్ 27 నుంచి ఏపిలో 3,000 కిమీ పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇడుపులపాయ నుంచి తిరుమల వరకు పాదయాత్రతో మొదలుపెట్టి శ్రీవారి దర్శనం చేసుకొన్న తరువాత రాష్ట్రంలో అన్ని జిల్లాలలోను ఏకధాటిగా సుమారు 6 నెలల పాటు పాదయాత్ర చేస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తన పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు నాయుడు పాలనలో అష్టకష్టాలు పడుతున్న ప్రజలను కలుసుకొని వారి సమస్యల గురించి తెలుసుకొంటానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కనుక పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ రాష్ట్రంలో పల్లెపల్లెకు వెళ్ళి ‘మీ కష్టాలు తీర్చేందుకు అన్న వస్తున్నాడని’ చెప్పవలసిందిగా జగన్ పిలుపునిచ్చారు. తెదేపా దుష్టపాలనను నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించి మళ్ళీ రాజన్న రాజ్యం ఏర్పాటు చేసుకొందామని జగన్ అన్నారు.
గతంలో జగన్ తండ్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కూడా సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చాలా తహతహలాడేవారు. అప్పట్లో చంద్రబాబు నాయుడే అధికారంలో ఉన్నారు. ఆయనను గద్దె దింపి తాను ముఖ్యమంత్రి కావడానికి రాజశేఖర్ రెడ్డి 2003లో 1475 కిమీ పాదయాత్ర చేశారు. ఆశించినట్లుగానే బాబుని గద్దె దింపి 2004లో ముఖ్యమంత్రి కాగలిగారు. అప్పుడు చంద్రబాబును దింపడానికి తండ్రి పాదయాత్ర చేస్తే, ఇప్పుడు బాబును దింపడానికి కొడుకు పాదయాత్ర చేయబోతుండటం విశేషం. జగన్ సోదరి షర్మిల కూడా 2012లో సమైక్య రాష్ట్రంలో మరో ప్రస్థానం పేరుతో 3,000 కిమీ పాదయాత్ర చేశారు. కానీ రాష్ట్ర విభజన కారణంగా ఆమె కష్టం బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది.
వచ్చే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి జీవన్మరణ సమస్య వంటివి కనుక ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ ను అప్పుడే రప్పించేశారు. ఇంకా ఎందుకైనా మంచిదని కాలినడకన తిరుపతి కొండెక్కి వెంకన్నకు కూడా జగన్ మొక్కుకొంటున్నట్లున్నారు. కనుక ఈసారైనా ఏపికి ముఖ్యమంత్రి కావాలనే జగన్మోహన్ రెడ్డి కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.