ఏపిలో వైకాపా బాధ్యత ఇక ప్రశాంత్ కిషోర్ దే!

July 09, 2017


img

గుంటూరులో ఆదివారం జరిగిన వైకాపా ప్లీనరీ సమావేశాల ముగింపు రోజున ఆ పార్టీ అధ్యక్షుడు చాలా కీలకమైన నిర్ణయాలు ప్రకటించారు. ముందుగా ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ ను పార్టీ కార్యకర్తలకు పరిచయం చేశారు. 

ఆయనను పరిచయం చేస్తూ, “2014ఎన్నికలలో నరేంద్ర మోడీకి విజయం సాధించిపెట్టి ఆయనను ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చోబెట్టిన వ్యక్తి ఈ ప్రశాంత్ కిషోర్. ఆ తరువాత బిహార్ ఎన్నికలలో నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రిగా చేశారు. పంజాబ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కేలాచేశారు. ఇప్పుడు ఆంధ్రాలో మన పార్టీకి సహాయసహకారాలు అందించబోతున్నారు. 2019 ఎన్నికలలో విజయం సాధించడానికి ప్రశాంత్ కిషోర్ మన పార్టీకి దశదిశా నిర్దేశం చేస్తారు,” అని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

ప్రశాంత్ కిషోర్ కు కేవలం ఏపి, తెలంగాణా రెండు రాష్ట్రాలలో వైకాపాను గెలిపించే బాధ్యత కట్టబెట్టారా లేక కేవలం ఏపిలో వైకాపా బాధ్యతలు మాత్రమే అప్పగించారా? అనే విషయం జగన్ ప్రకటించలేదు. తెలంగాణాపై జగన్మోహన్ రెడ్డికి ఆసక్తి లేదు, వైకాపాకు ప్రజాధారణ కూడా లేదు కనుక బహుశః ప్రశాంత్ కిషోర్ సేవలు ఏపికే పరిమితం కావచ్చు. 

ఆయన సేవలను జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకోవడంలో తప్పు లేదు కానీ ఆయనే నరేంద్ర మోడీనిప్రధాన మంత్రి కుర్చీలో కూర్చోబెట్టారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. యూపియే అవినీతి, అసమర్ధ పాలనతో విసుగెత్తిపోయున్న దేశప్రజలకు 2014 ఎన్నికలలో మోడీ ఒక ఆశాజ్యోతిగా కనిపించడంతో ఆయనను చూసే భాజపాను గెలిపించారనే సంగతి అందరికీ తెలుసు. ప్రశాంత్ కిషోర్ అప్పటికే బలంగావీస్తున్న మోడీ ప్రభంజనం మరింత ఉదృతం అవడానికి ఉపయోగపడ్డారు తప్ప ఆయన కారణంగానే మోడీ ప్రధానమంత్రి అయ్యరని జగన్ అనడం తప్పు. 


Related Post