గత ఏడాది రాష్ట్రంలో మిర్చికి క్వింటాలుకు రూ.13,000 వరకు ధర రావడంతో ఈ ఏడాది చాలా మంది రైతులు మిర్చి పండించారు. ఆ కారణంగా మార్కెట్లకు చాలా బారీ స్థాయిలో మిర్చి తరలిరావడంతో మిర్చి ధర ఊహించని స్థాయిలో పతనం అయ్యింది. గత ఏడాది క్వింటాలుకు రూ.13,000 పలికిన మిర్చి ఈ ఏడాది కేవలం రూ.1500-2,000 వరకు మాత్రమే రావడంతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారిని ఆదుకోవడానికి కేంద్రప్రభుత్వం కనీస మద్దతు ప్రకటించకుండా మీనమేషాలు లెక్కిస్తే, మద్దతు ధర ప్రకటించడం తమ పరిదిలో లేని అంశమని రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకొంది. మిర్చి రైతులను ఆదుకొనే నాధుడే లేకపోవడంతో నిరాశ నిస్పృహలతో క్రుంగిపోయిన అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు.
ఈ ఏడాది మిర్చివేసి నష్టపోయినందున రైతన్నలు మళ్ళీ మిర్చి జోలికి పోకుండా ఈసారి పత్తి పంటలు వేస్తున్నారు. ఇంతవరకు సుమారు 12.76 లక్షల హెక్టార్లలో పత్తి పంట వేశారు. ఈసారి సకాలంలో వర్షాలు పడుతుండటంతో మరో 4-8 లక్షల హెక్టార్లలో పత్తి వేసే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కనుక ఈసారి వ్యవసాయ మార్కెట్లను పత్తి ముంచెత్తబోతున్నట్లు స్పష్టం అవుతోంది.
మిర్చి ధరల విషయంలో రైతులకు, ప్రభుత్వానికి ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఖరీఫ్ సీజన్ లో వేర్వేరు వాణిజ్య పంటలు పండించడానికి రైతులను ప్రోత్సహిస్తామని, అందుకు వ్యవసాయశాఖ అధికారుల చేత రైతులకు అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. కానీ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ మొదలవగానే ఏకంగా 12 లక్షల హెక్టార్లలో రైతులు పత్తి వేశారంటే ముఖ్యమంత్రి చెప్పిన మాటలు అమలుకాలేదని అర్ధం అవుతోంది. కనుక ఈసారి పత్తి రైతులు ధరల సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం కనబడుతోంది. కనుక ప్రభుత్వం ఇప్పటి నుంచే నష్టనివారణ చర్యలు చేపడితే మంచిది.