హైదరాబాద్ లో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎవరికైనా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఒకపక్క హోరున వానలు కురుస్తున్నాయి. అయినా నగరంలో నీటి ఎద్దడే..కనుక వర్షాకాలమే అయినా మరోపక్క మంచినీళ్ళ ట్యాంకర్లు హడావుడిగా తిరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ పడుతున్న బారీ వర్షాలకు రోడ్లన్నీ చెరువులుగా మారిపోతున్నా త్రాగడానికి గ్రుక్కెడు నీళ్ళు ఎందుకు దొరకడం లేదు. నీళ్ళ ట్యాంకర్లతో నీళ్ళు తెప్పించుకోవలసిన దుస్థితి ఎందుకు ఏర్పడింది? అని ఆలోచిస్తే దానికి ఒక ప్రధాన కారణం కనిపిస్తోంది.
నగరంలో రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందున, భూగర్భంలోకి నీళ్ళు ఇంకే అవకాశమున్న ప్రాంతాలన్నీ విద్వంసానికి గురవుతున్నాయి. నీటి వనరులు ఉన్న ప్రాంతాలలోనే కాకుండా బండరాళ్ళతో నిండి ఉన్న ప్రాంతాలలో సైతం భారీ అపార్ట్మెంటులు నిర్మిస్తునందున సహజంగానే నీళ్ళ కొరత ఏర్పడింది. వందల కోట్లు ఖర్చు పెట్టి అందమైన బారీ భవనాలను నిర్మించడంపై నిర్మాణ సంస్థలు చూపుతున్న శ్రద్ధ, వర్షాకాలంలో పడిన నీటిని భూమిలోకి పంపించడంపై చూపడం లేదనేది చేదు వాస్తవం. అందుబాటులోకి వచ్చిన ఆత్యాధునిక రిగ్గింగ్ యంత్రాలతో 1000-2000 అడుగుల లోతు వరకు బోర్లు త్రవ్వించి నీళ్ళు పడకపోతే ట్యాంకర్లతో నీటి సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేసి చేతులు దులుపుకొంటున్నారు తప్ప ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం ఏమిటని ఆలోచించడం లేదు.
అందరూ భూమిలో నుంచి నీళ్ళు తోడుకోవాలని మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప బారీగా కురుస్తున్న వాననీటిని భూగార్భంలోకి పంపించేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదు. ఇది ఒక తప్పయితే ఆయాచితంగా లభిస్తున్న అమృతధారల వంటి వర్షపునీటిని మురుగు కాలువలలోకి పంపించి మళ్ళీ నీళ్ళ ట్యాంకర్లతో అంతగా పరిశుద్ధం కాని నీటిని వేలకువేలు పోసి కొనుక్కోవడం మరీ విచిత్రంగా ఉంది. చదువు సంద్యలేని గ్రామీణులు, లోకజ్ఞానం లేనివారు ఈవిధంగా వ్యవహరిస్తే ఆశ్చర్యం లేదు కానీ ఆధునిక జీవనం గడుపుతున్న నగర ప్రజలు, ముఖ్యంగా నిర్మాణ సంస్థలు ఇంత అనాలోచితంగా వ్యవహరించడం చాలా విస్మయం కలిగిస్తుంది.
ఉదాహరణకి ప్రస్తుతం అంటే బారీగా వర్షాలు పడుతున్న ఈ సమయంలోనే బంజారా హిల్స్ ప్రాంతంలో రోజుకు కనీసం 10-20 నీళ్ళ ట్యాంకర్లు తిరుగుతున్నాయి. అవన్నీ కలిపి రోజుకు సుమారు 25,000- 40,000 లీటర్ల నీళ్ళు సరఫరా చేస్తున్నాయి. వాటిలో దాదాపు చాలా ట్యాంకర్లు అదే ప్రాంతంలో ఉన్న ఒమేగా ఆసుపత్రికి సరఫరా చేస్తున్నాయి. సువిశాలమైన ఆ ఆసుపత్రి భవనాల టెర్రస్ ను లెక్కగడితే వాటిపై కురుస్తున్న వాననీరు సుమారు 30 లక్షల లీటర్ల వరకు ఉండవచ్చని ఈ రంగంలో నిపుణులైన సుబాష్ రెడ్డి చెపుతున్నారు. ఆ వాన నీటిని అంతా భూగర్భంలోకి పంపించగలిగితే ఏడాది పొడవునా ఆసుపత్రికి సరిపడినంత నీళ్ళు అందగలవని చెపుతున్నారు. ఈవిధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి పూర్తి అవగాహన ఉన్నవారు దానిని వినియోగిస్తున్నవారే ఇంత అనాలోచితంగా వ్యవహరిస్తుండటం విచిత్రమే కదా?
సుబాష్ రెడ్డిగారి సలహాలు, సూచనలు, సేవలు అవసరమైనవారు : 9440055253 లో ఆయనను సంప్రదించవచ్చు.