నేడు, రేపు వైకాపా ప్లీనరీ సమావేశాలు జరుగబోతున్నాయి. గుంటూరు-విజయవాడ జాతీయ రహదారి పక్కన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో జరుగుతాయి. వాటికి తెలంగాణ నుంచి కూడా వైసీపీ నేతలు హాజరు కానున్నారు. ఈ రెండు రోజుల సమావేశాలలో మొత్తం 18 అంశాలపై చర్చించి తీర్మానాలు ఆమోదిస్తారు. ఈ సమావేశాల్లో మొత్తం 18 తీర్మానాలపై చర్చ జరుగుతుంది. ఈరోజు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలో సమాధి వద్ద జగన్మోహన్ రెడ్డి, కుటుంబ సభ్యులు శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం జగన్ కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్లీనరీ వేదికవద్దకు చేరుకొంటారు.
ఎన్నికలకు రెండేళ్ళు సమయం మాత్రమే మిగిలి ఉన్నందున ఈ ప్లీనరీ సమావేశాలలో తమ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసుకొని, ఎన్నికలను ఎదుర్కోవడానికి ప్రణాళికలు రూపొందించుకొంటే బాగుంటుంది. కానీ వైకాపా ప్రవేశపెట్టబోతున్న తీర్మానాలను చూస్తే, ఈ సమావేశాలు ఏపి సిఎం చంద్రబాబు నాయుడుని నోరారా తిట్టుకోవడానికే ఉపయోగించుకోబోతున్నట్లు అర్ధం అవుతుంది.
ఈరోజు ప్రవేశపెట్టబోయే ఈ తీర్మానాలను చూస్తే ఆ సంగతి అర్ధం అవుతుంది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నఆటవిక పాలన, ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తక ఆవిష్కరణ, వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు, పార్టీ ఫిరాయింపులు, తెదేపా పాలనలో దగాపడ్డ డ్వాక్రా మహిళలు, ఎన్నికల హామీల అమలులో వైఫల్యం, కాపు రిజర్వేషన్లు, నెటిజన్లపై ప్రభుత్వం కక్ష సాధింపులు మొదలైన అంశాలపై చర్చించి ఆ తీర్మానాలను ఆమోదిస్తారు. ఇంత శ్రమపడి ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు వాటి వలన పార్టీకి ప్రయోజనం కలిగే విధంగా రూపొందించుకొని ఉంటే బాగుండేది. కానీ చంద్రబాబు నాయుడుని తిట్టుకోవడం వలన ఏమి ఉపయోగం కంఠశోష తప్ప!