రాష్ట్ర విభజన జరిగి మూడేళ్ళు పూర్తయినప్పటికీ ఇంతవరకు ఆంధ్రా, తెలంగాణా ఉద్యోగుల విభజన ప్రక్రియ ఒక కొలిక్కి రాలేదు. పైగా ఉద్యోగుల పంపకాలలో ఇరు రాష్ట్రప్రభుత్వాల మద్య ప్రతిష్టంభన ఏర్పడటంతో విద్యుత్ శాఖలోని సుమారు 1100 మంది ఉద్యోగుల భవిష్యత్ అయోమయంగా మారింది. తమను ఆంధ్రా లేదా తెలంగాణా విద్యుత్ శాఖలలోకి తీసుకొని తమకు న్యాయం చేయాలని వారు గత 10-12 నెలలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ రెండు ప్రభుత్వాలు వారిని పట్టించుకోకపోవడంతో వారు, వారి మీద ఆధారపడున్న వారి కుటుంబాలు రోడ్డున పడి అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు వారికి మరో 24 మంది సెక్షన్ ఆఫీసర్లు కూడా తోడయ్యారు.
ఉద్యోగుల విభజన కోసం ఏర్పాటు చేసిన కమలనాధన్ కమిటీ సూచనల మేరకు ఆంధ్రామూలాలు ఉన్న వారందరూ ఆంధ్రాకు వెళ్ళిపోయేందుకు సిద్దపడ్డారు. వారందరినీ 2017, జనవరి 31వ తేదీ నుండి రిలీవ్ చేస్తూ తెలంగాణా సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వారి సీనియారిటీ ప్రకారం ఏపిలో పోస్టింగ్ ఇచ్చేందుకు ఖాళీలు లేకపోవడంతో జూనియర్ స్థాయిలో చేరేందుకు అంగీకరిస్తే తీసుకొంటామని ఏపి సర్కార్ తేల్చి చెప్పింది. వారు అందుకు అంగీకరించకపోవడంతో వారికి మాట మాత్రంగానైనా చెప్పకుండా రిలీవ్ చేసి తెలంగాణాకు త్రిప్పి పంపించేసింది. వారిని తెలంగాణా ప్రభుత్వం కూడా మళ్ళీ ఉద్యోగాలలోకి తీసుకోవడానికి నిరాకరించడంతో ఆ 24 మంది అధికారుల భవిష్యత్ అయోమయంగా మారింది.
వారికి ఫిబ్రవరి నెల నుంచి ఇంతవరకు జీతాలు అందకపోవడంతో ఆర్ధిక సమస్యలలో చిక్కుకొన్నారు. వారిని ఏపి సర్కారే తిరిగి తీసుకోవాలని కోరుతూ తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. సింగ్ ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ వ్రాశారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల పంతాలు పట్టింపులకు మద్యలో ఉద్యోగులు బలైపోవడం చాలా బాధాకరం. సుమారు 30 ఏళ్ళు ప్రభుత్వోద్యోగులుగా పనిచేసిన తరువాత ఇప్పుడు ఎవరికీ కానివారయ్యారు. రోడ్డున పడ్డారు.