తెరాస ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయబోతున్నారా?

July 07, 2017


img

తెలంగాణా కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గురువారం మీడియాతో మాట్లాడుతూ, “ఈ నెల 17న జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికలలో మొత్తం 38 మంది మీరా కుమార్ కు ఓటేయబోతున్నారు. వారిలో తెరాస ఎమ్మెల్యేలు, ఎంపిలే ఎక్కువగా ఉంటారు. తెలంగాణా ఏర్పాటుకు సహకరించినందుకు కృతజ్ఞతగా ఆమెకు ఓటు వేయాలనుకొంటున్నట్లు మాకు తెలిసింది. కనుక ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ మతతత్వ భాజపా అభ్యర్ధి రాంనాథ్ కోవింద్ కు మద్దతు ఇవ్వడం మానుకొని, మీరా కుమార్ కు మద్దతు పలకాలి.

రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని భాజపా కాళ్ళ ముందు పెట్టడం సరికాదని తెరాస ఎమ్మెల్యేలు, ఎంపిలే అభిప్రాయపడుతున్నారు. కానీ కేసీఆర్ కు ఎదురుచెప్పలేక మౌనం వహిస్తున్నారు. ఇంతకాలంగా కేసీఆర్ కుటుంబ సభ్యుల కబంధ హస్తాలలో నలిగిపోతున్న తెరాస ప్రజాప్రతినిధులకు తమ సత్తా చూపించడానికి ఈ ఎన్నికలు ఒక మంచి అవకాశం కల్పించాయి. రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికలలో వారందరూ కేసీఆర్ ఒత్తిళ్ళకు లొంగకుండా ఆత్మప్రభోదానుసారమే మీరా కుమార్ కు ఓట్లు వేస్తారని మేము ఆశిస్తున్నాము,” అని అన్నారు. 

రాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొనబోయే ప్రజాప్రతినిధులకు వారి పార్టీలు ఎటువంటి విప్ లు జారీ చేయకూడదని ఎన్నికల కమీషన్ ముందే హెచ్చరించింది. కనుక రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరుగబోయే ఈ ఎన్నికలలో ఎవరు ఎవరికీ ఓటు వేశారనే విషయం కనిపెట్టలేరు. కనుక భాజపాను, ప్రధాని మోడీని వ్యతిరేకించేవారందరూ పార్టీలకు అతీతంగా తప్పకుండా మీరా కుమార్ కే ఓటువేసే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చాలా ఆశపడుతున్నారు.

కానీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ రాంనాథ్ కోవింద్ అంత గట్టిగా మద్దతు పలుకుతున్నప్పుడు, వారిని కాదని మీరా కుమార్ కు ఓటు వేస్తారనుకోలేము. బిహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో కొంత రాజకీయ అనిశ్చితితి నెలకొని ఉన్నందున అక్కడి ప్రజా ప్రతినిధులు క్రాస్ ఓటింగ్ చేసే అవకాశాలు ఉండవచ్చు. మిగిలిన రాష్ట్రాలలో మాత్రం అధిష్టానం ఎవరిని సూచిస్తే వారికే ఓట్లు వేయవచ్చు. తెరాస ప్రజా ప్రతినిధులలో  కొంత గందరగోళం సృష్టించేందుకే సంపత్ కుమార్ బహుశః ఈ కాకి లెక్కలు ప్రకటించి ఉండవచ్చు.


Related Post