దేశంలో ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మీరా కుమార్ కు 18 పార్టీలు మద్దతు ఇస్తున్నప్పటికీ వాటి ఎలెక్ట్రాల్ కాలేజీ ఓట్లతో ఆమె గెలువలేదనే సంగతి ఆమెతో సహా అందరికీ మొదటే తెలుసు. కాంగ్రెస్ పార్టీకి చిరకాలంగా సేవ చేసిన ఆమెను సముచితంగా గౌరవించకపోయినా పరువాలేదు కానీ ఓడిపోతారని తెలిసి కూడా ఆమెను బరిలో దింపడం ద్వారా సోనియా గాంధీ ఆమెను బలిపశువుగా చేశారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
అవి మీరా చెవిన కూడా పడటంతో ఆమె 'తానేమీ బలిపశువును కానని, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకే పోరాడుతున్న వీర పోరాటయోధురాలినని' సమర్ధించుకొంటున్నారు. అది వేరే సంగతి. అయితే ఈ ఎన్నికలలో ఆమె బలిపశువు అయ్యారనే అందరూ భావిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఈవిధంగా ఎవరినో ఒకరిని బలి పశువును చేయడం అలవాటే అని చెప్పవచ్చు. 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి కేంద్రంలో అధికారం దక్కించుకొన్నప్పుడు సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవి చేపడదామని ప్రయత్నించారు. కానీ ఆమె భారతీయురాలు కారనే కారణంతో త్రుటిలో ఆ సువర్ణావకాశం చేజారిపోయింది. అప్పుడు తన కనుసన్నలలో పనిచేసే డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ఆ కుర్చీలో కూర్చోబెట్టి పదేళ్ళపాటు ఆమె దేశాన్ని పాలించిన సంగతి అందరికీ తెలుసు.
ప్రధాని పదవి చేపట్టిన పాపానికి ఆ పదేళ్ళలో జరిగిన కుంభకోణాలలో డాక్టర్ మన్మోహన్ సింగ్ కేసులలో ఇరుకొన్న సంగతి తెలిసిందే. తెలంగాణా ఇచ్చిన ఘనత సోనియా గాంధీకి, కుంభకోణాలు ఆయనకు దక్కాయి.
పదేళ్ళపాటు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని పదవి చేపట్టడానికి ధైర్యం చేయలేకపోయిన రాహుల్ గాంధీ 2014 ఎన్నికల తరువాత అందుకు సిద్దమని ప్రకటించినపుడు, రాహుల్ నేతృత్వంలో పని చేయడానికి నాకు అభ్యంతరం లేదని డాక్టర్ మన్మోహన్ సింగ్ చేత చెప్పించింది. గొప్ప ఆర్ధికవేత్తగా పేరుపొందిన, అపార రాజకీయ, పరిపాలనానుభవం ఉన్న ఆయన చేత ఆవిధంగా చెప్పించి ఘోరంగా అవమానించింది.
యూపి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన ఎన్నికల వ్యూహనిపుణుడు ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు మొదట షీలా దీక్షిత్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించింది. కానీ ఆ తరువాత మళ్ళీ ఆయన సూచనల మేరకే సమాజ్ వాదీ పార్టీతో పొత్తులు పెట్టుకొని అఖిలేష్ యాదవ్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా అంగీకరించింది. అప్పుడు షీలా దీక్షిత్ ను బలిపశువుని చేసింది.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం మీరా కుమార్ ను బలిపశువుగా చేసింది. మళ్ళీ తెరాసను వేలెత్తి చూపుతోంది!