బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ కు కేంద్రం వరుసగా షాకులు ఇస్తోంది. ఈరోజు తెల్లవారుజాము నుండి ఆయన, భార్య రబ్రీదేవి, కుమారుడి ఇళ్ళలో సిబిఐ అధికారులు దాడులు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. పాట్నాలోని ఆయన ఉంటున్న ఇంటితో బాటు డిల్లీ, పాట్నా, రాంచి, పూరి, గుర్గావ్ తో సహా మొత్తం 12 చోట్ల ఏకకాలంలో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లాలూ రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు హోటల్స్ కాంట్రాక్టులలో అక్రమాలకు పాల్పడిన కేసులో ఈ సోదాలు జరుప్తున్నట్లు సమాచారం. రెండు ప్రైవేట్ స్టార్ హోటల్స్ కు లబ్ది చేకూర్చినందుకు ప్రతిగా ఆయనకు పాట్నా నగరం నడిబొడ్డున కోట్లు విలువచేసే 2 ఎకరాల భూమిని తీసుకొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రస్తుతం లాలూ కుమారులు ఇద్దరూ నితీష్ కుమార్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. లాలూకు చెందిన ఆర్జెడి మద్దతుతోనే నితీష్ కుమార్ ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది. కానీ నితీష్ కుమార్ లాలూతో సఖ్యతగా ఉండే బదులు ప్రధాని నరేంద్ర మోడీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్ధి రాంనాథ్ కోవింద్ కు మద్దతు పలికి మోడీకి మరింత దగ్గరయ్యారు. మోడీ కూడా ఆయనను మళ్ళీ తమ ఎన్డీయే కూటమిలోకి చేర్చుకొని బిహార్ లో ఆయన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నారు. మోడీ-నితీష్ కుమార్ మద్య స్నేహం పెరిగినప్పటి నుంచే తమపై ఐటి, సిబిఐ, ఈడిల నుంచి వేధింపులు మొదలయ్యాయని లాలూ భావిస్తున్నారు. కనుక లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ దాని వలన నితీష్ కుమార్ ఎటువంటి నష్టమూ జరుగదు కానీ చేజేతులా అధికారం వదులుకొంటే లాలూయే ఇంకా బలహీనపడతారు. అంతే కాదు..ఆర్జెడిలో అధికారం కోరుకొంటున్న ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి నితీష్ కుమార్ పంచన చేరినా ఆశ్చర్యం లేదు. కనుక ఇప్పుడు లాలూ ఏమిచేయబోతున్నారో చూడాలి.