జనసేన పార్టీ వచ్చే ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాలలో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఆయన వచ్చే ఏడాది మార్చి నెలలో సినిమాలకు గుడ్ బై చెప్పేసి ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తారని, ఆలోగా రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేస్తామని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి కొన్ని రోజుల క్రితం తిరుపతిలో ప్రకటించారు.
ఆ ప్రయత్నాలలో భాగంగానే జూలై 8,10,15 తేదీలలో మహబూబ్ నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలలో వరుసగా జనసేన సమావేశాలు నిర్వహించనున్నారు. జనసేన పార్టీలో చేరడానికి ఆసక్తి కలిగి ఆన్-లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొన్నవారికి ఇంటర్వ్యూలు చేసి పార్టీలో చేర్చుకొంటారు.
అయితే తెలంగాణా ప్రజలు జనసేనను ఆదరిస్తారా? అంటే అనుమానమే. అందుకు కొన్ని బలమైన కారణాలు కనబడుతున్నాయి.
పవన్ కళ్యాణ్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులు ఉన్నప్పటికీ చిరంజీవి ప్రజారాజ్యం ప్రయోగం విఫలం కావడం, తెలంగాణాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పవన్ కళ్యాణ్ ఆంద్రా మూలాలు మొదలైన అంశాలు జనసేనకు అవరోధాలుగా కనబడుతున్నాయి. కనుక తెలంగాణా ప్రజలు తెరాస, కాంగ్రెస్ పార్టీలను కాదని జనసేనను ఆదరించి అధికారం కట్టబెడతారా? అని ఆలోచిస్తే కాదనే సమాధానం వస్తుంది.
వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్య వంటివి కనుక ఎట్టి పరిస్థితులలో విజయం సాధించి అధికారం చేజిక్కించుకోవడానికి అది సర్వశక్తులు ఒడ్డిపోరాడటం ఖాయం. కనుక దానిని నిలువరించేందుకు తెరాస కూడా గట్టి ప్రయత్నాలు చేయడం తధ్యం. వాటి మద్య జరిగే మహాయుద్ధంలో జనసేన ప్రవేశిస్తే డిపాజిట్లు కూడా దక్కకపోవచ్చు.
తెలంగాణాలో ఇంకా భాజపా, తెదేపా, మజ్లీస్, వామపక్షాలు ఉన్నాయి. కొత్తగా మరికొన్ని పార్టీలు పుట్టుకు వస్తున్నాయి. తెరాసతో భాజపా, కాంగ్రెస్ తో తెదేపా పొత్తులు పెట్టుకొనే ఆలోచనలో ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. కనుక ఒకవేళ జనసేన వామపక్షాలతో పొత్తులు పెట్టుకొన్నా వాటిని ఎదుర్కోవడం కష్టమే..ఓడించడం అసంభవమేనని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ కు మరి ఇవన్నీ తెలియవనుకోలేము. అయినా ఎందుకు ముందుకు వెళుతున్నారో...ఏమి సాధించాలనుకొంటున్నారో ఆయనే చెప్పాలి.