రైతుల ఆత్మహత్యలు ఆపలేము: కేంద్రం

July 06, 2017


img

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వాలకే కాక సామాన్య ప్రజలకు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. వాటిని నివారించేందుకు కేంద్రప్రభుత్వం ఏమి చర్యలు చేపడుతోందో తెలుపాలంటూ సిటిజన్స్ రిసోర్స్ అండ్ యాక్షన్ ఇనిషియేటివ్ అనే సంస్థ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. గురువారం దానిపై విచారణ జరిగినప్పుడు కేంద్రప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ చేసిన వాదనలు, వాటిపై సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ వాస్తవమని చెప్పక తప్పదు. 

దేశంలో మొత్తం 12 కోట్ల మంది రైతులు ఉన్నారని వారికి మేలు కలిగించే ఫసల్ భీమా పధకం వంటి అనేక పధకాలు, చర్యలు చేపడుతున్నామని, వాటికి ఫలితాలు కనిపించేందుకు కనీసం ఏడాది వ్యవధి పడుతుందని కనుక అంతవరకు తమకు (కేంద్రప్రభుత్వానికి) సమయం ఇవ్వాలని వేణుగోపాల్ చేసిన వాదనలతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డివై చంద్రచూడ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఏకీభవిస్తూ ‘ఈ సమస్యను రాత్రికి రాత్రే పరిష్కరించడం కాదని’ అభిప్రాయం వ్యక్తం చేసింది. 

కోట్లాదిమంది రైతుల సమస్యలను పరిష్కరించడం కేవలం కేంద్రప్రభుత్వం వల్ల కూడా సాధ్యం కాదనే చెప్పాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దానికి పూర్తిగా సహకరించాలి. అదేవిధంగా కేంద్రప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలను సమానంగా చూడటం అవసరం. అప్పుడే ఈ సమస్యను పరిష్కరించడం సాధ్యమవుతుంది. కానీ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను విభిన్నపార్టీలు నడిపిస్తున్నందున సహజంగానే వాటి మద్య రాజకీయాలు నడుస్తుంటాయి. ఆ కారణంగా పధకాలు, వాటి ప్రయోజనాలు రైతులకు చేరవు..లేదా చేరడంలో ఆలస్యం అవుతుంటుంది.   

కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ భీమా పధకాన్ని తెలంగాణా ప్రభుత్వం సరిగ్గా అమలుచేయడం లేదని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇటీవల చేసిన ఆరోపణలను అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కనుక రైతుల సంక్షేమం కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర స్థాయిలో అధికారులు అందరూ సమిష్టిగా కృషి చేసినప్పుడే ఈ సమస్యను పరిష్కరించడం సాధ్యం అవుతుంది. కానీ అందరూ సమిష్టి కృషి చేయగలరా? అంటే అనుమానమే! మరి ఏడాది తరువాత ఎటువంటి ఫలితాలు వస్తాయో చూడాలి.


Related Post