కోదండరామ్ కాంగ్రెస్ ఏజంటు అనుకొన్నాము కానీ..

July 06, 2017


img

తెరాస ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ ప్రొఫెసర్ కోదండరామ్ పై తీవ్ర విమర్శలు చేశారు. “ఇంతకాలం ప్రొఫెసర్ కోదండరామ్ కాంగ్రెస్ ఏజంటు అని అనుకొన్నాము. కానీ ఆయన కాంగ్రెస్ అనధికార ప్రతినిధి అని మాకు అర్ధం అయ్యింది. వేదికలు వేరైనా కాంగ్రెస్ పార్టీ, ఆయన మాట్లాడే మాటలు ఒక్కటే. తెలంగాణాలో రైతన్నలకు నీళ్ళు అందించడానికి మా ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్ నేతలు కోర్టులలో పిటిషన్లు వేసి అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. నార్లాపూర్ నుంచి డిండి ప్రాజెక్టుకు నీరు తీసుకువచ్చి ఫ్లోరైడ్ పీడిత మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు నీళ్ళు అందించడానికి మేము ప్రయత్నిస్తుంటే ప్రొఫెసర్ కోదండరామ్ అభ్యంతరాలు చెపుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆంధ్రా రాయలసీమ ప్రాంతాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీగా నీళ్ళను తరలించుకొని పోతున్నా ఏనాడూ ప్రశ్నించని ప్రొఫెసర్ కోదండరామ్ మన రాష్ట్రంలోని ప్రాజెక్టు నుంచి మన గ్రామాలకు నీళ్ళు అందించాలని ప్రయత్నిస్తున్న మా ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నిస్తున్నారు. ఆయన నల్లగొండ, మహబూబ్ నగర్ ప్రజల విద్వేషాలు సృష్టిస్తున్నారు. ఆయన గురించి ప్రజలు ఏమనుకొంటున్నారో తెలుసుకోవాలను కొంటే ఒకసారి మునుగోడు, దేవరకొండలో పర్యటిస్తే సరి,” అని అన్నారు. 

ప్రజలలో అపారగౌరవం ఉన్నప్రొఫెసర్ కోదండరామ్ తమ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నప్పుడు ఆయనను ఏవిధంగా ఎదుర్కోవాలో తెలియక మొదట్లో తెరాస తికమకపడింది. కానీ దానికొక మార్గం కనుగొంది. అదే..ఆయనపై కాంగ్రెస్ ఏజంట్ అనే ముద్ర వేయడం. దానిని ఆయన గట్టిగా ఖండించకపోవడంతో తెరాస అదే వాదనను కొనసాగించసాగింది. ఒక అబద్దాన్ని వందసార్లు నిజమని వాదిస్తే నిజమైపోదు కానీ చివరకు ఆ వాదనలలే నిజమని అందరూ నమ్మే పరిస్థితి ఏర్పడవచ్చు. ప్రొఫెసర్ కోదండరామ్ విషయంలో తెరాస అదే సూత్రం పాటిస్తోందని చెప్పవచ్చు.

అయనపై కాంగ్రెస్ ఏజంటనే ముద్ర వేసింది కనుక తెరాస నేతలు ఇప్పుడు నిర్భయంగా ఆయనను విమర్శించగలుగుతున్నారు. కానీ రాజకీయలపై ఆసక్తి లేని ప్రొఫెసర్ కోదండరామ్ తనను ఎమన్నా పట్టించుకోవడం మానేసి చాలా కాలమే అయ్యింది. కనుక ఇటువంటి విమర్శలపై ఆయన ఏవిధంగా స్పందిస్తారని ఎదురు చూడటం కూడా అనవసరమే.


Related Post