"ప్రజలు ఏమి తినాలో, ఎటువంటి బట్టలు ధరించాలో, ఏమి చూడాలో ఏలా జీవించాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందా?" అని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి మీరా కుమార్ ప్రశ్నించారు. ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టుకొనేందుకు ఆమె దేశమంతటా పర్యటిస్తూ, నిన్న మేఘాలయకు వెళ్ళారు.
అక్కడ ఎమ్మెల్యేలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “భాజపా అధికారంలోకి వచ్చిన తరువాత దేశప్రజలను కులాలు, మతాలువారిగా విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్నవారు దేశాసమగ్రతను కాపాడేందుకే కృషి చేయాలి కానీ తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మద్య చిచ్చుపెట్టకూడదు. ఇటువంటి సమస్యలు సృష్టిస్తున్నపార్టీల సిద్దాంతాలను వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకే నేను ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నాను. కనుక అందరూ నాకు మద్దతు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను,” అని మీరా కుమార్ అన్నారు.
మీరా కుమార్ అడుగుతున్న ప్రశ్నలు, చెపుతున్న సమస్యలు సహేతుకమైనవే కానీ ఆమెను గెలిపించినంత మాత్రాన్న ఆ సమస్యలన్నీ ఆమె పరిష్కరించలేరని అందరికీ తెలుసు. దేశాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నామని బలంగా నమ్ముతున్న మోడీ సర్కార్ ఆమె వాదనలతో ఏకీభవించదని కూడా తెలుసు.
కానీ ఈ ఎన్నికల సందర్భంగా మోడీ హయంలో దేశంలో మతపరమైన విభజనరేఖలు గీయబడుతున్నాయనే ఆమె వాదన ప్రజలకు బాగా చేరుతోందని మోడీ సర్కార్ గ్రహించడం చాలా అవసరం. ఈ ఎన్నికలలో రాంనాథ్ కోవింద్ విజయం సాధించినప్పటికీ, భాజపాకు, మోడీ సర్కార్ కు మున్ముందు ఈ ‘విభజన అంశం’ వలన నష్టం జరిగే అవకాశం ఉండవచ్చు. కనుక ఇప్పుడే మేలుకొంటే మంచిది.