ఆర్టీసి వజ్ర సంకల్పంతో మరిన్ని నష్టాలు!

July 06, 2017


img

ప్రైవేట్ బస్సులు 60-70 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నా లాభాలు అర్జిస్తుంటే, ఆర్టీసి బస్సులు 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నా ఎందుకు నష్టాలు వస్తున్నాయనేది మిలియన్ డాలర్ ప్రశ్న. దానికి అనేక కారణాలు..వాటికీ పరిష్కారాలు కూడా కనుగొన్నారు కానీ నష్టాలు మాత్రం తగ్గట్లేదు. 

చివరకి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చొరవ తీసుకొని అనేక పరిష్కారాలు సూచించారు. బస్ స్టేషన్ల దగ్గరకు ప్రజలు వచ్చి బస్సుల కోసం పడిగాపులు కాయడం కంటే ప్రజల దగ్గరకే బస్సులు నడిపితే మంచిదని, తక్కువ రద్దీ ఉన్న రూట్లలో పెద్ద బస్సులు నడపడం కంటే చిన్న బస్సులు నడిపితే నష్టాలు తగ్గించుకొని లాభాల బాట పట్టవచ్చని కేసీఆర్ సూచించారు. 

ఆ సూచనలకు అనుగుణంగా ఏర్పాటు చేసినవే ఆర్టీసి వజ్ర బస్ సర్వీసు. హైదరాబాద్ నుంచి వరంగల్, నిజామాబాద్ రూట్లలో ఈ సర్వీసులను ప్రారంభించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ  పొదుపు చర్యలలో భాగంగా వాటిలో కండెక్టర్ లేకుండా ఆన్-లైన్ ద్వారా టికెట్స్ విక్రయిస్తున్న కారణంగా అవి ఖాళీగా తిరుగుతూ ఆర్టీసికి మరింత నష్టాలు తెస్తున్నాయి. 

దీనిపై 3-4 మూడు నెలల క్రితమే మీడియాలో వార్తలు, విమర్శలు వచ్చాయి. వాటిపై ఇన్నాళ్ళకు స్పందించిన టిఎస్ఆర్టిసి చైర్మన్ ఎస్.సత్యానారాయణ వజ్ర బస్ సర్వీసుల పనితీరు, లాభనష్టాలపై లెక్కలు తీసి చూసి వాటిని అధిగమించేందుకుఒక పరిష్కరం సూచించారు. 

హైదరాబాద్ నుంచి వరంగల్, నిజామాబాద్ వెళ్ళే వజ్ర బస్సులలో ఇంతవరకు మార్గమద్యంలో ప్రయాణికులను ఎక్కించుకొనేవి కావు. కానీ ఇకపై ప్రయాణికులు ఎక్కడ చెయ్యెత్తి ఆపినా బస్సులలో ఎక్కించుకోవాలని నిర్ణయించారు. కానీ వారు ఎక్కడ ఎక్కినా హైదరాబాద్ లో చివరి పాయింట్స్ అయిన ఉప్పల్, సుచిత్ర జంక్షన్ నుంచి టికెట్స్ చెల్లించవలసి ఉంటుంది. కానీ బస్సులో టికెట్ ఇవ్వరు కనుక బస్సు దిగిన తరువాత టికెట్ తీసుకోవలసి ఉంటుంది. ఇదే విచిత్రమనుకొంటే మరో విచిత్రం కూడా ఉంది. బస్సు చివరి పాయింట్స్ లో ఆర్టీసి కౌంటర్స్ ఉన్నప్పటికీ అక్కడ ఆ టికెట్స్ ఇవ్వరు. ఆ పక్కనే ఉన్న ప్రైవేట్ ఏజంట్ ఇస్తాడు. ఒక్కో టికెట్ కు రూ.18 చొప్పున ఆ ఏజంటుకు ఆర్టీసి కమీషన్ చెల్లిస్తుంది. ఇటువంటి చిత్రవిచిత్రమైన ఆలోచనలు, విధానాలు అమలుచేస్తుంటే మరి ఆర్టీసికి నష్టాలు రాక లాభాలు వస్తాయా?


Related Post