వర్షాకాలం వచ్చినప్పుడే మొక్కల గురించి ప్రభుత్వాలు ఆలోచిస్తుంటాయి. తెలంగాణా ప్రభుత్వం కూడా అంతే. గత రెండేళ్ళుగా ప్రతీ ఏటా వర్షాకాలంలో హరితాహారం పేరిట రాష్ట్రంలో మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున అమలు చేస్తోంది. కానీ ఆ తరువాత ఆ మొక్కలను ఎవరూ పట్టించుకోకపోవడంతో వాటిలో చాలా వరకు చచ్చిపోతున్నాయి. లేదా మేకలు, ఆవులు తినేస్తున్నాయి. ఒకవేళ ఈ మూడేళ్ళలో వేసిన మొక్కలన్నిటినీ కాపాడగలిగి ఉండి ఉంటే నేడు మళ్ళీ కొత్తగా మొక్కలు నాటవలసిన అవసరమే ఉండేది కాదేమో?
మళ్ళీ వర్షాకాలం వచ్చింది కనుక మళ్ళీ ‘హరితహారం...చెట్లు పెంచుదాం..చెట్లు పెంచడం వలన ఎన్నో లాభాలు..’ అంటూ అధికార పార్టీ నేతలు, మంత్రుల హడావుడి మొదలైంది. మొక్కలు నాటి, ఫోటోలకు ఫోజులివ్వడంతో వారి పని పూర్తయిపోతుంది. మళ్ళీ ఏడాది వరకు ఆ ఊసే ఉండదు.
మొక్కలు నాటడం, వాటిని కాపాడుకోవడం వంటి చిన్న చిన్న పనులు చేయడానికి మంత్రుల స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు, వాటిలో వేలాదిమంది ఉద్యోగులు ఉన్నారు. ఇంత పెద్ద యంత్రాంగం ఉన్నా ఆ పని గురించి కూడా ముఖ్యమంత్రే ఆలోచించి పరిష్కారాలు సూచించవలసి వస్తోంది అంటే అర్ధం ఏమిటి? క్రింద పనిచేస్తున్నవారిలో చిత్తశుద్ధి లేదనే కదా?
మొక్కలు కొనడం, వాటికి గోతులు త్రవ్వడం, ట్రీ గార్డులు ఏర్పటు చేయడం, ఏడాది పొడవునా ఆ మొక్కలకు నీళ్ళు పోయడం అన్నీ డబ్బుతో ముడిపడున్న అంశాలే. కనుక వాటికి తగినంత నిధులు సమకూర్చడం ప్రభుత్వం బాధ్యత. వేసిన మొక్కలను కాపాడటం క్రిందస్థాయి యంత్రాంగం బాధ్యత. కానీ నిధుల కొరత, అధికారులలో చిత్తశుద్ధి కొరవడితే ఈ కార్యక్రమం ఎలా విజయవంతం అవుతుంది?
ఇంత బారీ స్థాయిలో హరితహారం పేరిట నాటుతున్న లక్షల మొక్కలు పెరగకపోయినా వాటి కోసం పాటలు..బ్యానర్లు, టోపీలు, కండువాలు, మీడియా ప్రకటనల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతూనే ఉంది. ఇవేమీ లేకపోయినా మన మొక్కల రామయ్య ఒక్కడే ఒంటి చేత్తో ఖమ్మం జిల్లాలో కోటి మొక్కలు నాటి పెంచగలిగాడు. ఎందుకంటే ఆయనకు చిత్తశుద్ధి ఉంది కనుక.