భారత్ సేనలకు ఇదే ఆఖరి అవకాశం: చైనా మీడియా

July 05, 2017


img

“డోక లా ప్రాంతం నుంచి భారత్ సేనలు గౌరవప్రదంగా వెనుతిరిగి వెళ్ళేందుకు ఇదే ఆఖరి అవకాశం. వారు మా భూభాగంలో నుంచి గౌరవప్రదంగా వెనక్కువెళ్ళకుపోతే తరిమికొడతాము. నిజమే..భారత రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పినట్లుగా భారత్ 1962 నాటి భారత్ కాదని మాకు తెలుసు..అలాగే చైనా కూడా1962 నాటిది కాదని భారత్ గుర్తుంచుకోవాలి. ఈసారి యుద్ధం అంటూ జరిగితే 1962లో కంటే చాలా తీవ్రంగా నష్టపోతుందని భారత్ తెలుసుకొంటే మంచిది,” అని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ సంపాదకీయంలో హెచ్చరించింది.

అంతే కాదు..ఇకపై భారత్ లో చైనా సంస్థలు పెట్టుబడులు పెట్టడం తగ్గించుకొంటే మంచిదని సూచించింది. సిక్కింలో భారత్-చైనా సేనల మద్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారత్ లోని చైనా సంస్థలు, వ్యక్తులపై దాడులు జరిగే ప్రమాదం ఉందని కనుక అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరింది.       

సిక్కింలోని డోక లా ప్రాంతం తమదేనని వాదిస్తున్న చైనా అక్కడ రోడ్డును నిర్మిస్తోంది. కానీ అది సిక్కింలో భాగం అని భారత్ వాదిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలను మిగిలిన భారతదేశంతో అనుసంధానిస్తున్న సిలిగురి వద్ద ‘చికెన్ నెక్’గా పిలువబడే సన్నటి మార్గం సహజంగానే భారత్ కు అతి కీలకమైనది. దానికి అతిసమీపంలో ఉన్న డోక లా ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తోంది. తద్వారా సిక్కిం, మేఘాలయ, అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలను భారత్ తో సంబంధాలు తెగిపోతాయి. అందుకే భారత్ చైనా దురాక్రమణను గట్టిగా ఎదుర్కొంటోంది.

కానీ చైనా వాదన మరొకలా ఉంది. ఇటీవల అమెరికా పర్యటించి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మెప్పు కోసమే తమతో ఈవిధంగా కయ్యానికి కాలు దువ్వుతున్నారని చైనా ఆరోపిస్తోంది. సిక్కిం విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గే ప్రసక్తి లేదని తెగేసి చెపుతోంది. గత నెల 6వ తేదీ నుంచి భారత-చైనా సైనికుల మద్య సిక్కింలో ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది.


Related Post