నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూరు గ్రామానికి చెందిన గండికోట వెంకటయ్య అనే పత్తి రైతు బుధవారం ఉదయం తన పొలంలోనె పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. వెంకటయ్య 4 ఎకరాలలో పత్తి పంట వేశాడు. కానీ నీళ్ళు లేక పంట ఎండిపోతుండటంతో అప్పులు చేసి తన పొలంలో మంగళవారం రాత్రి బోరు వేయించాడు. కానీ దానిలో నీళ్ళు పడకపోవడంతో కాస్త దూరంలో మరొకటి వేయించాడు. దానిలో కూడా నీళ్ళు పడకపోవడంతో వరుసగా మరో మూడు చోట్ల బోర్లు వేయించాడు. కానీ 5 బొట్లు వేసినా దేనిలోను ఒక్క చుక్క నీరు పడకపోవడంత్ తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యాడు. చేసిన అప్పులు ఏవిధంగా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకొన్నాడు. వెంకటయ్య ఆత్మహత్య చేసుకోవడంతో అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చాలా ఆవేదన చెందుతున్నారు.
బోరుబావులు వేసే ముందు తప్పనిసరిగా అక్కడ భూగర్భంలో నీరు ఉందో లేదో తెలుసుకోవాలి. అదేవిధంగా అక్కడికి నీటిని చేరేందుకు భూగర్భంలో చీలికలు ఉన్నాయో లేవో తెలుసుకోవలసి ఉంటుందని ఈ రంగంలో విశేష అనుభవం ఉన్న సుబాష్ రెడ్డి చెపుతున్నారు. కానీ చాలా మంది రైతులు అది పట్టించుకోకుండా వాస్తు ప్రకారమో లేక వేరే ఆనవాయితీల ప్రకారమో బోరుబావులు త్రవ్విస్తుంటారని, ఒకవేళ అక్కడ భూగర్భంలో నీళ్ళు ఉండి ఉంటే రైతు అదృష్టమే కానీ లేకుంటే ఈవిధంగా నష్టపోతారని సుబాష్ రెడ్డి చెపుతున్నారు. కనుక బోరుబావులు త్రవ్వేవారు ముందుగా రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకొన్నా లేదా తన వంటి జలవనరుల నిపుణులను సంప్రదించినా క్షేత్రస్థాయిలో పరీక్షించి బోరు త్రవ్వితే అక్కడ నీళ్ళు పడతాయో లేదో తెలియజేయగలమని అన్నారు.
ఐదు బోరుబావులు తవ్వించినా నీళ్ళు పడకపోవడంతో ఆ రైతు ఆర్ధికంగా చికిపోవడమే కాకుండా చివరకు ప్రాణాలు కూడా తీసుకొన్నాడు. దానితో అతని కుటుంబం రోడ్డున పడుతుంది. ఈ ఆవేదన, కష్టంలో ఉన్న సదరు రైతు కుటుంబ సభ్యులు లేదా ఆ గ్రామ ప్రజలు ఆ బోరుబావులకు తక్షణమే మూతలు బిగించకపోతే అవి పసిపిల్లల పాలిట మృత్యు కూపాలుగా మారే ప్రమాదం కూడా ఉంది.
ఇటీవల ఇక్కారెడ్డిగూడలో బోరుబావిలో పడి చిన్నారి పాప మరణించిన తరువాత బోరుబావుల త్రవ్వకాలను నియంత్రించేందుకు కటినమైన చర్యలు చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కానీ ఇప్పుడు ఎవరూ ఆ సమస్య గురించి మాట్లాడటం లేదు. ఆ విషాద సంఘటన జరిగిన రెండు వారాలలోపే ఒకేరోజు..ఒకే ప్రదేశంలో ఏకంగా 5 బోరుబావులను త్రవ్వడం జరిగింది. అందుకు ఎవరిని నిందించాలి? వెంకటయ్య మృతికి ఎవరిని నిందించాలి?అతనినా? లేక డబ్బుకు ఆశపడి అనుమతులు లేకుండా బోరుబావులను త్రవ్వే సంస్థనా? గ్రామంలో బోరుబావులు త్రవ్వుతున్నప్పటికీ పట్టించుకొని గ్రామస్థాయి అధికారులనా? లేక ప్రభుత్వాన్నా?
సుబాష్ రెడ్డిగారి సలహాలు, సూచనలు, సేవలు అవసరమైనవారు : 9440055253 లో ఆయనను సంప్రదించవచ్చు.