వందనం...కోవిందుడికి జగన్ పాదాభివందనం!

July 05, 2017


img

ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ వయసులో తమకంటే పెద్దవారు, గౌరవనీయులైన వ్యక్తులకు బహిరంగంగా పాదాభివందనం చేయడానికి ఎన్నడూ వెనుకాడరు. అందుకు వారిని ప్రజలందరూ మెచ్చుకొంటారు కూడా. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను స్వాగతం పలికి పాదాభివందనం చేస్తుంటారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ రాష్ట్రపతి పట్ల అంత గౌరవం ప్రదర్శించినప్పటికీ రాష్ట్రపతిని చాలా అరుదుగా కలుసుకొంటారు. కానీ జగన్ మాత్రం తరచూ ఏదో వంకతో ఆయనను కలుసుకొంటారనే సంగతి అందరికీ తెలిసిందే. 

రాంనాథ్ కోవింద్ హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ ఆయనకు ఘనస్వాగతం పలికి ఆయనకు మద్దతు పలికారు కానీ పాదాభివందనం చేయలేదు. కానీ ఎప్పుడూ ఎవరికీ పాదాభివందనం చేసే అలవాటు లేని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి అభ్యర్ధి రాంనాథ్ కోవింద్ కు బహిరంగంగా పాదాభివందనం చేయడం విశేషం. అయనతో బాటు వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి కూడా కోవింద్ కు పాదాభివందనం చేయడం మరీ విశేషం. 

అసలు తెదేపాకు మిత్రపక్షంగా ఉన్న భాజపా అభ్యర్ధికి వైకాపా మద్దతు ఇవ్వడమే విచిత్రమనుకొంటే, రాష్ట్రపతి అభ్యర్ధికి జగన్ పాదాభివందనం చేయడం మరీ విడ్డూరంగా ఉంది. 

నిజానికి తెలంగాణాలో వైకాపా ఎమ్మెల్యేలు, ఉన్న ఒక్క ఎంపి తెరాసలో చేరిపోయినందున రాంనాథ్ కోవింద్ కు వైకాపా మద్దతు ఇచ్చే పరిస్థితిలో లేదు. అయితే ఏపిలో వైకాపాకు ఎమ్మెల్యేలు, ఎంపిలు ఉన్నందున రాంనాథ్ కోవింద్ ను జగన్ విజయవాడలో కలిసి మద్దతు ప్రకటించి ఉండి ఉంటే సబబుగా ఉండేది. కానీ అక్కడ చంద్రబాబు నాయుడుని, తెదేపా మంత్రులు, నేతల సమక్షంలో ఆయనను కలుసుకోవడం ఇష్టం లేక హైదరాబాద్ లో కలుసుకొన్నట్లున్నారు. జగన్, విజయసాయి రెడ్డి ఇద్దరూ సిబిఐ కేసుల భయంతోనే ఆయనకు మద్దతు పలుకుతున్నారని వాదిస్తున్న తెదేపా నేతలు ఇప్పుడు ఈ పాదాభివందనాలకు కూడా అదే కారణం అని ఎద్దేవా చేయవచ్చు. 


Related Post