వర్మా.. ఏమిటీ అతి?

July 05, 2017


img

రామ్ గోపాల్ వర్మ వరుసగా తీస్తున్న అనేక సినిమాలలో ఒకటీ అరా తప్ప హిట్ కావు. అయినా ఇండస్ట్రీలో మరే పాపులర్ దర్శకుడికి లేనంత పాపులారిటీ ఉంది. అందుకు కారణం అందరికీ తెలిసిందే. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, ప్రముఖులను విమర్శిస్తూ, వివాదాస్పదమైన సినిమాలు తీస్తూ వాటి గురించి అతిగా ప్రచారం చేసుకొంటుంటారు. అందుకే ఒక్క హిట్ అందించలేకపోయినా ఇండస్ట్రీలో బలంగా నిలద్రొక్కుకోగలిగారు.

హిందీలో అతనితో సినిమాలు చేయడానికి అమితాబ్ బచ్చన్ వంటి వారు అంగీకరిస్తారేమో కానీ తెలుగులో ఏ పెద్ద హీరో కూడా చేయడానికి ఇష్టపడకపోవడానికి కారణం కూడా ఇదే. కానీ ఇప్పుడు బాలకృష్ణ హీరోగా స్వర్గీయ ఎన్టీఆర్ జీవితచరిత్రను సినిమాగా తీస్తానని రామ్ గోపాల్ వర్మ ప్రకటించేశాడు. 

అందుకు బాలకృష్ణ, ఆయన అభిమానులు అంగీకరించారో లేదో తెలియదు కానీ అప్పుడే ఆ సినిమాపై వివాదాలు మొదలయ్యాయి. అందరికంటే ముందుగా ఎన్టీఆర్ అర్ధాంగి లక్ష్మి పార్వతి స్పందించారు. 

ఆ సినిమాలో బాలకృష్ణను హీరోగా పెడితే తాను అంగీకరించనని కమల్ హసన్ అయితే ఎన్టీఆర్ పాత్రకు చక్కగా సరిపోతారని అన్నారు. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన సంఘటనలన్నిటినీ (బహుశః చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడవడం వంటివి) ఉన్నదున్నట్లు చూపించాలని ఆమె డిమాండ్ చేశారు.   

ఆ సినిమాలో ఎన్టీఆర్ గురించి ప్రజలెవరికీ తెలియని అనేక రహస్యాలను చూపిస్తానని రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు. అంతటితో ఆగకుండా ‘ఏ దేశమేగినా..ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అనే రాయప్రోలు వారి కవితను మార్చి ‘ఏ దేశమేగినా..ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి తెలుగు భారతిని..తండ్రి ఎన్టీఆర్ ని” అని తన వికారమైన గొంతుతో ఆ కవితను ఖూనీ చేస్తూ ఆలపించారు. ఒక దర్శకుడిగా కాకుండా 8 కోట్ల తెలుగు ప్రజలలో ఒకడిగా ఈ మాట అంటున్నానని రామ్ గోపాల్ వర్మ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. 

తెలుగువారందరికీ ఎన్టీఆర్ అంటే అపారమైన అభిమానం ఉన్నమాట వాస్తవం. కొందరు ఆయన అద్భుతమైన నటనను చూసి అభిమానిస్తే, మరికొందరు అపర శ్రీకృష్ణ పరమాత్మగా, మరికొందరు తెలుగు బాషాభిమానిగా, ఇంకొందరు గొప్ప రాజకీయ నాయకుడిగా, తెలుగు తమ్ముళ్ళు తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడుగా అభిమానిస్తుంటారు. ఆయనను అభిమానించేందుకు ఎవరి కారణాలు వారికున్నాయి. కానీ ఎవరూ కూడా ఆయనను తమ తండ్రిగా భావిస్తున్నామని అనరు. కానీ రామ్ గోపాల్ వర్మ వంటివారు మాత్రమే అనగలరు. 

రామ్ గోపాల్ వర్మకు గొప్ప సినిమాలు తీయలేకపోయినా తను తీసే ప్రతీ సినిమాను దానిపై స్వయంగా వివాదాలు సృష్టిస్తూ మార్కెటింగ్ చేసుకొనే ప్రయత్నం చేస్తుంటారు. తన వంగవీటి సినిమాను కూడా వివాదాస్పదం చేసి దానికి చాలా హైప్ సృష్టించినా అది ఎప్పుడు రిలీజ్ అయ్యిందో థియేటర్ల నుంచి ఎప్పుడు డబ్బాలు సర్దుకొని వెళ్ళిపోయిందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ పేరు చెప్పుకొని మళ్ళీ హడావుడి చేస్తున్నాడు. 


Related Post